ఆర్బీ తండా వాసులపై లాఠీఛార్జ్
కొడంగల్‌లో ఉద్రిక్తత
సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. తమ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన పేరుతో సాగు భూములను గుంజుకుని కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలకు కట్టబెట్టేందుకు చేస్తున్న కుట్రలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, ఆర్బీతండా, పులిచర్లకుంటతండా, ఈర్లపల్లి తండాకు చెందిన పలువురు రైతులు ఆందోళన చేపట్టారు. తాజాగా ఆర్బీ తండా రైతులు తమ ఆందోళనలను ఉధృతం చేశారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ఆర్బీ తండా వాసులు శుక్రవారం ఉదయం ఆందోళనలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆర్బీ తండాకు చేరుకుని ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తండా వాసులపై లాఠీచార్జి చేశారు. దీంతో పోలీసులు, తండావాసుల మధ్య వాగ్వాదం నెలకొంది.
ఫార్మా విలేజ్ వద్దే.. వద్దు..
దుద్యాల మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచెర్ల గ్రామాల్లో ప్రభుత్వం ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేయాలని భావించగా..అప్పటి నుంచి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉన్నది. ఈ మూడు గ్రామాల పరిధిలోని 1274.25 ఎకరాల ప్రభుత్వ, పట్టా భూములను సేకరించాలని సర్కారు నిర్ణయించగా అక్కడి రైతులు భగ్గుమంటున్నారు. కొన్నేండ్లుగా ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని.. వాటి ని ఫార్మా కంపెనీలకు ఇస్తే ఎలా బతకాలని నిలదీస్తున్నారు. గత రెండు నెలలుగా ప్రతిరోజూ కడాతోపాటు దుద్యాల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ప్రజలు, రైతులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ప్రాణాలైనా ఇస్తాం.. కానీ.. భూములను ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు.
703.65 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం దుద్యాల మండలంలోని పోలేపల్లి గ్రామంలోని సర్వేనంబర్ 67లో 130 ఎకరాలు, హకీంపేటలోని సర్వేనంబర్ 252లో 366 ఎకరాలు, లగచెర్లలోని సర్వేనంబర్ 102లో 140 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అయితే ఈ భూమి సరిపోకపోవడంతో ప్రభుత్వ, పట్టా భూములను కలిపి మూడు గ్రామాల పరిధిలో మొత్తం 1274.25 ఎకరాలను సేకరించాలని సర్కారు నిర్ణయించింది. హకీంపేటలో 505.37 ఎకరాలు, పోలేపల్లిలో 130 ఎకరాలు, లగచెర్లలో 643 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఇప్పటికే లగచెర్ల పరిధిలోని 632. 26 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల పట్టా భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.