ఓ చిన్నారి కథ విని భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి
రాజకీయాలలో ఆయన ఓటమెరగని నాయకుడు. ఆరడుగుల బుల్లెట్. అభివృద్ధి రాక్షసుడు. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తు వేయడంలో దిట్ట. ఆయన ఎత్తులు వేస్తే ప్రత్యర్థులు చిత్తే. మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీల నేతలను చెడుగుడు ఆడుకుంటాడు. సబ్జెక్ట్ ఏదైనా, సమస్య ఏదైనా సరే ఆయన మాట్లాడితే, రంగలోకి దిగితే ప్రత్యర్థులు తోక మూడుస్తారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు, పార్టీ ఒడుదుడుకులు ఎదుర్కొన్నప్పుడల్లా ముందుండి పార్టీ క్యాడర్‌కు నేనున్నాంటూ భరోసానిస్తూ … పార్టీ కింద పడినప్పుడల్లా తన వ్యూహంతో పార్టీని పైకిలేపుతూ…పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న, సిద్ధిపేట నియోజకవర్గ ప్రజలనే తన కుటుంబంగా భావించే మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు…తండ్రి చనిపోయినా కష్టపడి చదువుతున్న ఓ చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకున్నారు. భావోద్వేగానికి గురయ్యారు.
వివరాల్లోకి వెళ్లితే… ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు చెడు వ్యసనాలపై దృష్టి పెట్టకుండా…భవిష్యత్‌లో ఉన్నంతంగా ఎదిగేందుకుగానూ శనివారం సిద్ధిపేటలోని మెట్రో గార్డెన్‌లో ‘భద్రంగా ఉండాలి… భవిష్యత్‌లో ఎదగాలి’ అనే వినూత్న కార్యక్రమానికి హరీష్‌రావు శ్రీకారం చుట్టారు. ఈ అవగాహన కార్యక్రమానికి సిద్ధిపేటలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 2వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌రావు విద్యార్థులతో ముఖాముఖిని నిర్వహించగా…ఓ చిన్నారి (సాత్విక) మాట్లాడుతూ.. తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని, తల్లే తనను కష్టపడి చదివిస్తోందని కన్నీళ్లు పెట్టుకుంది.
ఆ చిన్నారి మాటలు విన్న హరీష్‌రావు ఒక్కసారిగా చిన్న పిల్లాడిలా కంటతడి పెట్టుకున్నారు. చిన్నారి కథ విన్న హరీష్‌రావుతో పాటు అక్కడున్న వారందరూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఎక్కి ఎక్కి ఏడుస్తూ తన కష్టాన్ని వివరించిన బాలికను హరీష్‌రావు ఆత్మీయంగా తన దగ్గరికి తీసుకుని, వేదికపైన తన పక్కనే కూర్చోబెట్టుకుని ఓ వైపు ఆ చిన్నారి కన్నీళ్లూ తూడుస్తూ, ఓదారుస్తూనే, మరోవైపు హరీష్‌రావు కూడా కంటతడి పెట్టుకున్నారు. ఆ విద్యార్థిని ఎమోషనల్ మాటలకు హరీష్‌రావు కంటతడి పెట్టుకోవడం చూసి కార్యక్రమానికి వొచ్చిన వారందరూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. మరి కొందరు చిన్నారులు మాట్లాడుతూ..తమ చదువు కోసం పేరెంట్స్ పడుతున్న కష్టాలను గుర్తించి, తాము తమ చదువు కోసం తపిస్తున్న పేరెంట్స్‌ను ఇబ్బంది పెడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయి, బిడ్డ చదువు కోసం తల్లి పడుతున్న కష్టాన్ని కంటతడి పెట్టుకుంటూ విద్యార్ధిని వెల్లడించింది. ఆ విద్యార్థిని వేదన హరీష్‌రావునే కాకుండా అందర్నీ ఏడ్చేలా చేసింది.