Thursday, November 7, 2024

రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న కాదు.. ప్ర‌జా పీడ‌న‌

ముఖ్యమంత్రికి మెదడులో విషం తప్ప విజన్ లేదు.
విద్యార్థుల నుంచి రైతుల వరకు అందర్నీ రోడ్లపైకి తెచ్చారు..
సీఎం రేవంత్‌పై ఫైర్ అయిన మాజీ మంత్రి హ‌రీష్ రావు

రాష్ట్రంలో 11 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి పాల‌న చూస్తే ప్రజాపాలన కాదు ప్రజా పీడనగా అనిపిస్తోంద‌ని, ఏ వర్గానికి కూడా తాము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధర్నాలతో అట్టుడుకుతున్నదని, సీఎం వికృత రూపం బట్టబయలైంద‌ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఫైర్ అయ్యారు. నోటికి వచ్చినట్లు మాత్రమే మాట్లాడ‌డ‌మే సీఎంకు తెలుసున‌ని, హామీల గురించి అడిగితే నోటికి ఇష్టం వొచ్చినట్లు తిడుతున్నాడ‌ని మండిప‌డ్డారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కొత్త హామీలు కాదు, కెసిఆర్ మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాలను కొన‌సాగించ‌డంలేద‌ని ఆరోపించారు. బతుకమ్మ చీర‌లు లేవు, రైతు బంధు లేదు. రుణమాఫీ కాలేదు. పంటలు కొనే దిక్కు లేదన్నారు. రాష్ట్రంలో పత్తి ఎక్కడైనా కొనుగోలు చేశారా అని ప్ర‌శ్నించారు. 7521 ఏంఎస్‌పి అని చెప్పి మోసం చేశారని, క్వింటా 5వేలకు అమ్ముకుంటున్నారు. బోనస్ అని చెప్పి బోగస్ చేశారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ లో రైతులు రోడ్డెక్కారు. తక్కువ ధరకు వరి అమ్ముకునే దుస్థితి నెల‌కొంది. మ‌క్కలు కొనుగోలు చేయ‌డం లేదు. సోయాబీన్ పంట కొన్నవి కూడా వాపస్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ కాళ్ల‌ మీద పడే దుస్థితి నెల‌కొంద‌ని హ‌రీష్ రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులను మోసం చేశార‌ని, ఏటా రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థి భరోసా కార్డు పేరు చేప్టి మోస‌గించార‌ని హ‌రీష్ రావు ధ్వ‌జ‌మెత్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్‌ లేదు. విద్యార్థుల బతుకులు ఆగమ‌వుతుంటే మొద్దు నిద్ర పోతున్నారు. తక్షణం పెండింగ్ డీఏ లు, పీఆర్‌సి అని చెప్పి ఉద్యోగులను మోసం చేవశారు. ఒక్క డీఏ ఇచ్చి దీపావళి చేసుకో అంటున్నారు. మేము క్లియర్ చేసిన డీఏ ఇచ్చి గొప్పలు చెబుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు పైసలు ఇవ్వని ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమ‌ని విమ‌ర్శించారు. ముఖ్యమంత్రికి మెదడులో విషం తప్ప విజన్ లేదని, అవగాహన లేక, పరిపాలన చేత‌గాక రాష్ట్రాన్ని దివాలా తీశార‌ని అన్నారు. తాము పోరాటం చేస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నార‌ని అంటున్నార‌ని, రుణమాఫీ గురించి మాట్లాడితే వికృతంగా మాట్లాడార‌ని అన్నారు. నా మీద బాడే షేమింగ్ చేశారు. మూసి అక్రమాలు బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తే కేటీఆర్ పై దాడి చేస్తున్నార‌ని, ఆయన క్యారెక్టర్ దెబ్బ తీసే యత్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఏడాది కూడా పూర్తి కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత పెరిగింది. ప్రజా పాలన అని రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నడు.

పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. పురుగుల్లేని భోజనం కోసం గురుకుల పిల్లలు, స్కాలర్ షిప్పుల కోసం విద్యార్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, రుణమాఫీ, రైతు బంధు కోసం రైతన్నలు, జీతాల కోసం ఆశాలు, అంగన్ వాడీలు, డీఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు, నిధులు విడుదల చేయాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది, ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు, ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు, సమస్యలు పరిష్కరించాలంటూ పోలీసులు, పింఛన్లు పెంచాలంటూ వృద్ధులు, ఇలా రాష్ట్రంలో.. బడిలో చదువుకునే పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ సక్సెస్ ఫుల్ గా రోడ్ల మీదకు తెచ్చాడ‌ని హ‌రీష్‌రావు సెటైర్లు వేశారు.

కేసీఆర్ పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే, పది నెలల పాలనలో నువ్వు అందరి కడుపు కొట్టావని విమర్శిచారు. ఫ్యామిలీ ఫంక్షన్ జరిగితే తప్పుగా ప్రచారం చేస్తున్నారని, రేవ్ పార్టీ జరగకముందే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. రేవ్ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారా..? దీపావళి పండుగ జరుపుకుంటే దాడి చేశారు. రెయిడ్ చేసిన అధికారులే చెప్పారు. అక్కడ ఏమి దొరకలేదని.. దురదృష్టవశాత్తు కొన్ని మీడియా ప్ర‌తినిధులు కూడా జ‌ర‌గంది జరిగినట్లు ప్రచారం చేశారు. కేటీఆర్ ప్రజల సమస్యల మీద కొట్లడితే, కక్ష తీర్చుకునే విధంగా ప్రభుత్వం చూస్తోంది. మీరు ఎంత భయపెట్టినా మేము పోరాటం ఆపేది లేదు. మూసి అభివృద్ధిని ప్రారంభించింది కేసీఆర్. గోదావరి నీళ్ళు ముసీకి తెచ్చే యత్నం చేసింది కేసీఆర్ అని అన్నారు.

అధికారంలోకి వస్తే పోలీసుల కష్టాలు తీర్చుతామ‌ని చెప్పారు. ఇదెక్కడి న్యాయం అని అడిగితే ఉద్యోగాలు ఊడగొడుతారా? పండుగ పూట వారికి ఎందుకు ఏడిపిస్తున్నావ్ అని ప్ర‌శ్నించారు. సెలవు కావాలంటే సర్వీసు నుండి తొలగిస్తారా? రక్షక భటులకే రక్షణ లేని రాక్షస పాలన ఈ రాష్ట్రంలో నడుస్తున్న‌ది. నేరస్తుడు పాలకుడైతే రేవంత్ పాలనలా ఉంటుంది. పండుగ, పెళ్లిళ్ల సీజన్ లో ఎవరైనా 144 సెక్షన్ పెడుతారా? రజాకర్ రాజ్యంలా రేవంత్ పాలన కొన‌సాగుతోంది. ప్రజలు అంటే ఎందుకు అంత భయం.. కంచెలు లేని పాలన అని ఆంక్షల పాలన తెచ్చారు. ఎస్పీ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నారు. అశోక్ నగర్ ను శోక నగర్ గా మార్చారు. పిల్లల వీపులు కమిలి పోయేలా కొట్టించారని హ‌రీష్ రావు ఆరోపించారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా కాదు, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారని హ‌రీష్ రావు ఆరోపించారు. ప్రజల సమస్యల గురించి ఏనాడు మాట్లాడడు. మేనిఫెస్టో గురించి మాట్లాడడు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి కోరుతాడు. రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ గురించి బిఆరెస్ కొట్లాడితే బిజెపి ఎందుకు మాట్లాడదు అని ప్ర‌శ్నించారు.

కానిస్టేబుళ్లను స‌ర్వీసు నుంచి తొల‌గించ‌డం దుర్మార్గం
10 మంది పోలీసులను సర్వీస్ నుంచి తొలగించడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య అని అన్నారు.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని, “నేను పోలీసు కుటుంబం నుంచి వచ్చాను.. పోలీసుల కష్టాలు నాకు తెల్సు. ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు” అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వొచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు.? అని హ‌రీష్‌రావు నిల‌దీశారు భేషజాలు పక్కన పెట్టి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, 10 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకొని, సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హ‌రీష్ రావు డిమాండ్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular