- అప్పులు చేసి జేబులు నింపుకుంటున్న సీఎం రేవంత్
- మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు
నాడు బీఆర్‌ఎస్ చేసిన అప్పులపై ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ.. నేడు 15 నెలల కాలంలోనే రూ. 1.65 లక్షల కోట్లు అప్పులు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. నాడు అప్పు చేసి 70 లక్షల అన్నదాతలకు అండగా నిలిచి వారికి రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు ఖాతాల్లోకి వేసి.. రూ.28 వేల కోట్లు రుణమాఫీ చేసి.. రూ.6 వేల కోట్లతో రైతుబీమా చేసి.. లక్ష 11 వేల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందేలా చేశామన్నారు. అలాగే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు.. పారిశ్రామిక, గృహావసరాలకు 24 కరెంటు అందించి.. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, సీతారామసాగర్ కట్టి 45 వేల చెరువులు కుంటలు బాగుచేశామని, 45 లక్షల మందికి పైగా ఆసరా ఫించన్లతో అండగా నిలిచినట్లు చెప్పారు.
కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కల్యాణలక్ష్మి, వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు, 30 మెడికల్, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటుచేస్తే అప్పులు తప్పని రాద్దాంతం చేశారని విమర్శించారు. 15 నెలల పాలనలో రూ.1.65 లక్షల కోట్లు అప్పు చేసి.. రుణమాఫీ ఎగ్గొట్టి.. రైతుబంధు ఎగ్గొట్టి.. రైతుబీమా లేకుండా చేసి.. కరెంటుకు కోతలు వేసి.. గురుకులాలను గాలికి వదిలేసి.. కాళేశ్వరాన్ని ఎండబెట్టి.. పాలమూరు రంగారెడ్డిని పడావుపెట్డి.. శ్రీశ్కెలం సొరంగం కుప్పకూల్చి 8 మంది ప్రాణాలు బలితీసుకున్న బాధ్యతలేని ప్రభుత్వం ఇది అని కాంగ్రెస్‌పై కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క పథకం అమలు చేసింది లేదు.. గల్లీలో గాలిమాటలు, దిల్లీకి ధనం మూటలు మోసుడు తప్ప.. 15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు.