- పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు అన్యాయం జరిగింది
- మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
కాంగ్రెస్ మాదిగలను దూరం చేసుకోవద్దని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోందని రేవంత్ పాలనపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా పాలన కొనసాగిస్తోందన్నారు. మాదిగ సమాజం చాలా వెనుకబాటులో ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మాదిగలు కీలక పాత్ర పోషించారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు అన్యాయం జరిగిందని విమర్శలు వస్తున్నాయన్నారు. ఒక మాదిగ బిడ్డగా తనకు కూడా బాధగా ఉందన్నారు.
మాదిగల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని అనుకుంటున్నానని, కాంగ్రెస్ మాదిగలకు దూరం కాకూడదని, దీనిని సరిచేయాలని కాంగ్రెస్ పెద్దలకు వేడుకుంటున్నానని ఆయన చెప్పారు. ఒక జాతికి అన్యాయం చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేయాలని ఆయన కోరారు. రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇది జరిగింది కాదని అందరికీ సమన్యాయం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ మాదిగల అభివృద్ధికి కట్టుబడి ఉన్న పార్టీ అని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మాదిగల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని అనుకుంటున్నానన్నారు. వరంగల్ సీటును మాదిగలకు ఇచ్చే విధంగా చూడాలని ఆయన కోరారు.