- ఇంకా పెండింగ్‌లోనే బకాయిలు…
- హైకోర్టు ఆదేశాల మేరకు తాము నడుచుకుంటున్నాం: ఆర్టీసి అధికారులు
మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆర్టీసికి అద్దె చెల్లించే విషయంలో నిర్లక్షం వహిస్తున్నారని, ఆ మాల్‌లో అక్రమంగా థర్ట్‌పార్టీకి స్టాళ్లను కేటాయించారని ఆర్టీసి అధికారులు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్‌స్టేషన్ సమీపంలోని 7,059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) అద్దెకు ఇస్తూ ఒప్పందం చేసుకుంది. ప్రత్యామ్నాయ రెవెన్యూ పెంచుకునేందుకు గాను ౩౩ సంవత్సరాలకు బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) కింద 01.06.2013న ఆర్టీసికి చెందిన భూమిని ఈ సంస్థకు లీజుకు ఇచ్చింది.
ఆ స్థలంలో ఒక షాపింగ్ మాల్‌ను ఆ కంపెనీ డెవలప్ చేసింది. 2017లో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఈ మాల్‌ను టేక్‌ఓవర్ చేసుకొని షాపింగ్ మాల్‌ను జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీపెక్స్‌గా పేరు మార్చుకున్నారు. దీంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాల్‌లోని స్టాళ్లను థర్డ్ పార్టీలకు లీజుకు ఇచ్చారు. దీంతోపాటు ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదు.
ఇంకా రూ.2.51 కోట్ల అద్దె పెండింగ్‌లో…
2015 అక్టోబర్ వరకు రూ.4.30 కోట్ల బకాయిలను ఆర్టీసికి విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పుడే టెర్మినేషన్ ఆర్డర్‌ను ఆర్టీసి జారీ చేసింది. దీంతో రెండు పర్యాయాలు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన సంస్థ రూ.69 లక్షలను ఆర్టీసికి చెల్లించారు. మిగతా బకాయిలను చెల్లించాలని పలుసార్లు నోటీసులు పంపించినా విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్పందించలేదు. గతేడాది అక్టోబర్ వరకు రూ.8.65 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో ఆర్టీసి అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేయడంతో అక్టోబర్‌లో రూ.1.50 కోట్లను ఆ కంపెనీ చెల్లించింది. ఆ తర్వాత షోకాజ్ నోటీసులు పంపించడంతో గతేడాది డిసెంబర్‌లో విడతల వారీగా రూ.2.40 కోట్లను మరోసారి ఆ సంస్థ చెల్లించింది. అనంతరం ఆ సంస్థ ఆర్టీసి ఇచ్చిన షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది.
టిఎస్ ఆర్టీసికి బకాయిలు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో విడతల వారీగా విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.రెండు కోట్లను ఆర్టీసికి చెల్లించింది. ఈ కేసుపై బకాయిలన్నీ నెల రోజుల్లో చెల్లించాలని మార్చి 27న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బకాయిలు చెల్లించకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసిని హైకోర్టు ఆదేశించింది. నెల రోజుల గడువు పూర్తయిన మొత్తం బకాయిలను ఆ కంపెనీ చెల్లించలేదు. ఇప్పటివరకు రూ.2.51 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్టీసి అధికారులు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యేవి నిరాధారమైన ఆరోపణలు….
ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 9వ తేదీన నోటీసులు ఇవ్వడానికి ఆర్టీసి అధికారులు షాపింగ్ మాల్‌కు వెళ్లారు. ఆ మాల్‌లో థర్డ్ పార్టీ స్టాళ్లు ఉండటంతో వారికి సమాచారం ఇచ్చేందుకు మైక్‌లో అనౌన్స్ చేశారు. అయితే ఈ విషయమై శుక్రవారం నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి టిఎస్ ఆర్టీసి, సంస్థ ఉన్నతాధికారులపై అసత్య ఆరోపణలు చేశారని, ఈ నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని టిఎస్ ఆర్టీసి యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోందని ఆర్టీసి తెలిపింది. అద్దె బకాయిల విషయంలో లీజు ఒప్పందం, హైకోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటోం దని టిఎస్ ఆర్టీసి యాజమాన్యం స్పష్టం చేసింది.
5 సంవత్సరాలు…20కి పైగా నోటీసులు…
బకాయిలు చెల్లించాలని 5 సంవత్సరాలుగా 20కి పైగా నోటీసులను మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సంస్థకు ఆర్టీసి అధికారులు జారీ చేశారు. తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించడంలో ఏమాత్రం నిజం లేదని ఆర్టీసి అధికారులు తెలిపారు. బకాయిల విషయంలో సంస్థ ఏమాత్రం రాజీ పడటం లేదని, నిబంధనల మేరకే వాటిని వసూలు చేస్తున్నామని ఆర్టీసి అధికారులు తెలిపారు. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా సంస్థపై, ఉన్నతాధికారులపై వ్యక్తిగతంగా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని ఆర్టీసి అధికారులు సూచించారు. త్వరలోనే పెండింగ్ బకాయిలను చెల్లించి సంస్థ మనుగడుకు కృషి చేయాలని వారు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి సూచించారు.