న్యూఢిల్లీ : కష్ట కాలంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి దేశాన్ని గట్టెక్కించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. సౌమ్యుడు గా పేరొందిన మన్మోహన్ సింగ్ రాజకీయాల్లో అజాతశత్రువుగా నిలిచారు. గత కొద్ది కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ ని గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చేర్పించారు.
ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతూ ఆయన 9.51 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26 న జన్మించారు. 2004 నుంచి 2014 వరకు ఆయన యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా పూర్తి మెజార్టీ లేకపోయినా చాకచక్యంతో ఆయన ప్రభుత్వాన్ని నడిపారు. అంతకుముందు పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్థలకు శ్రీకారం చుట్టారు.