టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి వద్దన్న పలువురు మంత్రులు
అయినా వెనక్కి తగ్గని సీఎం రేవంత్
అధిష్టానానికి సీనియర్ల కంప్లైంట్
టీఎస్న్యూస్ :
రాష్ట్ర మంత్రివర్గంలో తొలి చిచ్చు మొదలైంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ఎంపికపై సీఎం రేవంత్, పలువురు మంత్రుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. ఇటీవల దీనిపై ఇద్దరు మంత్రులు.. సీఎంపై తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి ఏకంగా సీఎంపై సీరియస్ కావడమే కాకుండా.. వెంటనే ఏఐసీసీకి సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది.
మహేందర్‌రెడ్డి వద్దు
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని నియమించడంపై కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా వివాదంగా మారింది. నిజానికి, పదవిలోఉన్నప్పుడు మహేందర్‌రెడ్డిపై టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఒక దశలో ‘సిగ్గు ’ ఉంటే రాజీనామా చేయాలి అంటూ సవాల్ చేశారు. అప్పుడు విద్యార్థుల మృతికి కారణమంటూ ఆరోపించారు. ప్రస్తుతం కీలకమైన టీఎస్పీఎస్సీ ఎంపికలో సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం పార్టీ వర్గాలను ఒక్కసారిగా షాక్‌లోకి తీసుకెళ్లింది. గతంలో నుంచి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటూ వస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తారని ప్రచారం జరిగింది. టీఎస్పీఎస్సీ పాలకమండలి నియామక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయన దరఖాస్తు కూడా చేసుకున్నారు. కానీ, ఎంపికలో మాత్రం భారీ ట్విస్ట్ ఇస్తూ.. మహేందర్‌రెడ్డిని ఎంపిక చేశారు. ఈ విషయం బయటకు రాగానే.. మంత్రివర్గంలోని పలువురు మంత్రులు సీఎంను కలిశారు. మహేందర్‌రెడ్డిని ఎంపిక చేయవద్దని, సిఫారసును వెనక్కి తీసుకోవాలంటూ సూచించారు. అప్పుడు సమాధానం చెప్పని సీఎం రేవంత్.. ఆ తర్వాత గవర్నర్‌తో ఆమోద ముద్ర వేయించిన విషయం తెలిసిందే.
అంతా ఇష్టమేనా..?
గవర్నర్ నుంచి ఆమోదం రాగానే.. పలువురు మంత్రులు ఉన్నఫళంగా సీఎం రేవంత్ దగ్గరకు వెళ్లి, వాగ్వాదానికి దిగినట్లు విశ్వసనీయ సమాచారం. మహేందర్‌రెడ్డిని ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించారు. అయితే, సీఎం నుంచి సరైన రిప్లై రాకపోవడంతో.. మంత్రులు మరింత రెచ్చిపోయినట్లు తెలిసింది. వికారాబాద్ప్రాంతానికి చెందిన మహేందర్‌రెడ్డికి, రేవంత్‌రెడ్డికి బంధుత్వం ఉందంటూ పార్టీ వర్గాలు గుసగుసగాచెబుతున్నాయి. అంతేకాకుండా ఇరువురి సతీమణులు కూడా బంధువులేనని, ఈ నేపథ్యంలోనే మహేందర్‌రెడ్డి టీఎస్పీఎస్సీ బాధ్యతలు అప్పగించారని టాక్. దీనిపై మంత్రులు నిలదీసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో.. ఓ మంత్రి వెంటనే ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మహేందర్‌రెడ్డి వ్యవహారంలో సీఎం నిర్ణయం కరెక్ట్ కాదని, ఈ పరిణామాలు పార్టీని సగానికిపైగా వెనక్కి తీసుకుపోతుందని, వ్యతిరేకత వస్తుందని అధిష్టానానికి కంప్లైంట్ చేశారు. ఇప్పటికీ మంత్రివర్గలో ఈ వివాదం కొనసాగుతూనే ఉన్నది.