రంగంలోకి ఈడీ – వివరాలివ్వాలని ఏసీబీకి లేఖ
మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఏసీబీ కేసులో ఎఫ్ఐఆర్, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఈడీ లేఖ రాసింది. వివరాలు రాగానే మనీ లాండరింగ్ నమోదు చేయనుంది. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో గురువారం కేసు నమోదు చేసిన ఈడీ.. నాటి పురపాలకశాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను ప్రధాన నిందితుడి (ఏ1)గా పేర్కొనడం తెలిసిందే. మరోవైపు, ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో తనపై నమోదు చేసిన ఏసీబీ కేసును కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని ఆయన కోరారు.
క్వాష్ పిటిషన్
ఫార్ములా ఈ కేసులో మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయగా.. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సింగిల్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు. అయితే, ఆ బెంచ్‌లో క్వాష్ పిటిషన్ విచారణకు అనుమతి లేదంటూ ఏసీబీ కౌన్సిల్ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో కేటీఆర్ తరఫు న్యాయవాది చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ గురించి మెన్షన్ చేయగా.. పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు అందాయి.
ఫార్ములా ఈ-రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీసంస్థకు సొమ్ము చెల్లించారంటూ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ ఏసీబీకి ఈ ఏడాది అక్టోబరు 18న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అప్పటి మున్పిల్ శాఖ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఆయన్ను ఏ1గా, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ2గా, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఏ3గా చేర్చారు. కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ వ్యవహారంపై దర్యాప్తు కోరుతూ.. సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు. ఈ మేరకు కేటీఆర్‌తో సహా మరో ఇద్దరిపై కేసులు ఫైల్ చేస్తూ.. విచారణ ప్రారంభించారు. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) డీఎస్పీ మాజిద్ అలీఖాన్ విచారణను ముమ్మరం చేశారు. ఇవాళ దాన కిషోర్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయటంతో పాటు.. హెచ్‌ఎండీఏ ఆఫీసులో ఫైల్స్ పరిశీలించనున్నారు.
నా తప్పు లేదు
కాగా, ఫార్ములా-ఈ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ వెల్లడించారు. అసలు ఆ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. అవినీతే లేనప్పుడు ఏసీబీ కేసు ఎక్కడిదని ప్రశ్నించారు. కేవలం సీఎం, ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి, కుంభకోణాలను బయటపెడుతున్నందుకే.. తమపై రాజకీయ వేధింపులకు దిగుతోందని ఆరోపించారు. ప్రపంచ పటంపై హైదరాబాద్ ఖ్యాతిని వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో.. నగరంలో ఫార్ములా-ఈ రేస్ నిర్వహించాలని ప్రయత్నం చేశామన్నారు.
రంగంలోకి ఈడీఇక ఈ వ్యవహారంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. ఎఫ్‌ఐఆర్ కాఫీతో పాటుగా.. హెచ్‌ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత మెుత్తం బదిలీ చేశారో ఆ వివరాలు ఇవ్వాలని కోరారు. నగదు ట్రాన్సక్షన్ జరిగిన తేదీలు కూడా ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ కావటంతో ఆ తర్వతా ఏం జరుగుతుందనేది ఉత్కంఠంగా మారింది.