- ఏసీబీ కేసులో పస లేదు…
- ఏదో రకంగా జైలుకు పంపాలని కుట్ర
- మీడియా సమావేశంలో మాజీ మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలు
- పార్టీ నేతలు, అభిమానుల న్యూ ఇయర్ శుభాకాంక్షలు
కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయటానికి బీఆర్‌ఎస్ కార్యకర్తలు పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరంలో బీఆర్‌ఎస్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిం చారు. పార్టీ కార్యాలయంలో పార్టీ అభిమానులు కెటిఆర్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఫార్ములా ఈ రేసు కేసుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఫార్ములా ఈ-రేస్ కేసులో తెలంగాణ హైకోర్టులో ఏ తీర్పు వొస్తుందో చూద్దామన్నారు. ఇందులో అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడది అని ప్రశ్నించారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ తప్పు అని వ్యాఖ్యలు చేశారు. ఈకేసులో ఈడీ ఎదుట ఈనెల 7న హాజరుపై తన లాయర్లు నిర్ణయిస్తారని తెలిపారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదని..తనకు న్యాయస్థానాల పై నమ్మకం ఉందన్నారు. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అంటూ వ్యాఖ్యలు చేశారు.
‘పాపం.. నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోంది. నాపై ఇది ఆరో ప్రయత్నం.. రేవంత్‌కు ఏం దొరకటం లేదు‘ అంటూ సెటైర్ విసిరారు. రూ. 600 కోట్ల సంగతి అటుంచితే.. ఒక్క పైసా కూడా అవినీతి లేదన్నారు. జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదన్నారు. రేసు కావాలని తాను నిర్ణయం తీసుకున్నానని.. వద్దనేది రేవంత్ నిర్ణయమన్నారు. ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్‌లో చర్చ జరగలేదన్నారు. ‘నాపై కేసు పెడితే.. రేవంత్‌పై కూడా కేసు పెట్టాలి. రేవంత్ రెడ్డి.. ఒక ముఖ్యమంత్రినా?‘ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు ఎదురయ్యే చిన్న, చిన్న అడ్డంకులను అధిగమించి లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న భారీ బహిరంగ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడాది మెదటి హాఫ్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలు పూర్తి చేస్తామన్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు.. వచ్చే అక్టోబర్ వరకు సమయముందని తెలిపారు. పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చూపిస్తామని స్పష్టం చేశారు. రైతుబరోసాతో రేవంత్ సర్కార్‌పై ప్రజల్లో తిరుగుబాటు రాబోతోందన్నారు. రైతు భరోసా కొందరికే ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు అని ప్రశ్నించారు. బ్యాంకులను ముంచేటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజిస్టేష్రన్లు ఇవ్వాలని రేవంత్‌కు లేదని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వమే కోర్టులో కేసులు వేయిస్తోందన్నారు. ఉద్యోగస్తులు, పాన్ కార్డ్ ఉన్నవాళ్ళకు రైతుభరోసా ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. .. ఫార్ములా ఈరేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
ఆ తీర్పు వెలువడే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్.. హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31న విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఈకేసు సంబంధించి హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి గురువారం ఈడీ ముందుకు విచారణకు హాజరుకానున్నారు. అలాగే జనవరి 3న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరవుతారు. వీరిద్దరి విచారణ మీద ఈనెల 7న కేటీఆర్ ఈడీ విచారణకు హాజరుకావాలా వద్దా అనేదానిపై నిర్ణయానికి వొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.