ఇక్కడ 2 వేల ఎకరాల్లో ఎకో పార్క్
హెచ్‌సీయూ భూ వివాదంపై సర్కారు మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఈ భూముల విక్రయాల విషయాన్ని పక్కన పెడితే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్కు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు అధికారవర్గాల సమాచారం. హెచ్‌సీయూలోని 400 ఎకరాల్లోనే కాకుండా.. వర్సిటీలోని 1600 ఎకరాలను కలిపి వరల్డ్ బిగ్గెస్ట్ ఎకో పార్క్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు.. హెచ్‌సీయూను ఫోర్త్ సిటీ వైపు తరలించే ప్లాన్ కూడా వేస్తున్నట్లు చెబుతున్నారు. అక్కడ ఇదే స్థాయిలో భూమిని కేటాయించి.. దాన్ని యూనవర్సిటీ పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించి, అక్కడే నూతన భవనాల నిర్మాణాన్ని సైతం ప్రభుత్వం తరపునే చెల్లించి ఇవ్వాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతకు ముందు ఇప్పుడున్న హెచ్‌సీయూ భూముల్లో సింగపూర్ లోని నైట్ సఫారీ, న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ తరహాలో నిర్మాణం చేసేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న వివాదానికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం కమిటీని కూడా అపాయింట్ చేసింది. ఈ కమిటీ ఎకో పార్క్‌పై కూడా వర్కవుట్ చేయనుందని తెలుస్తోంది.
అంగీకారంతోనే..!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంగీకరిస్తే.. ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా వర్సిటీకి చెందిన 1600 ఎకరాలనూ కలిపి 2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి హైదరాబాద్‌కే తలమానికంగా తీర్చిదిద్దాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. హెచ్‌సీయూకు ఫోర్త్ సిటీలో స్థలాన్ని ఇవ్వడమే కాకుండా భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని అంచనా వేస్తున్నారు. ఈ అంశాలన్నిటిపై భాగస్వాములతో మంత్రుల కమిటీ సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో గచ్చిబౌలి భూముల చుట్టూ పెద్ద దుమారమే రేగుతోంది. 400 ఎకరాలను ఇటీవలే సుప్రీం కోర్టు కేసు ద్వారా స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక అవసరాల కోసం వాడేందుకు డెవలప్ చేస్తోంది. అయితే ఆ భూముల వైపు రావద్దని హెచ్‌సీయూ స్టూడెంట్స్, అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ ఇలా అంతా కలిసి ఉద్యమం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చినా ఆందోళనలు సద్దుమణగడం లేదు. అయితే, అది గ్రీన్ జోన్ అని, నెమళ్ల స్థావరం అని రకరకాల పేర్లు పెట్టి ప్రభుత్వం తీసుకునేందుకు వీల్లేదన్న వాదనను విపక్షాలు తెరపైకి తెచ్చాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25 లోని 400 ఎకరాల భూమి చుట్టూ వివాదం పెరిగే సరికి ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది. డెవలప్ మెంట్ చేస్తున్న 400 ఎకరాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూములు లేవన్నది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల కిత్రం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుందని, అభివృద్ధి పనులతో అక్కడ ఉన్న రాళ్లకు నష్టం లేదని, అంతే కాదు.. 400 ఎకరాల్లో చెరువు కూడా లేదన్నది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ సమ్మతితోనే 2024, జులై 19న హెచ్‌సీయూ రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఇంజినీర్, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే జరిగిందని, అదే రోజు హద్దులు నిర్ధారించారని ప్రభుత్వ వాదన. 2004లోనే HCU ఈ భూములపై యాజమాన్య హక్కులను వదులుకుందని.. మొత్తం 5534 ఎకరాల భూమిని ప్రభుత్వానికి బదలాయించిందని తెలిపారు. దీనికి బదులుగా గోపనపల్లిలో 397 ఎకరాలను ప్రభుత్వం యూనివర్సిటీకి బదలాయించిందని తెలిపారు. దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగిపోయాయి.
మరోవైపు అసలు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్‌సీయూ భూముల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. హెచ్‌సీయూకు చెందిన భూముల్లో 50 ఎకరాలను మైహోమ్ రామేశ్వర్‌రావుకు కట్టబెట్టారని, అక్కడ ఆయన మైహోమ్ విహంగ పేరుతో అపార్ట్‌మెంట్స్ నిర్మించి సొమ్ము చేసుకున్నారని కాంగ్రెస్ అంటోంది. అప్పుడు ఆందోళన చేయని బీఆర్‌ఎస్, బీజేపీ.. ఇప్పుడు ప్రభుత్వ భూమి విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతోంది.