50 లక్షల పేద కుటుంబాల్లో ‘గృహజ్యోతి’
ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలు, విద్యుత్ సంస్థల దుబారా తగ్గింపు
విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు ప్రణాళికలు
దివాళా నుంచి విద్యుత్ రంగాన్ని ప్రగతిపథంలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళుతుంది. ఈ నేపథ్యంలోనే 50 లక్షల పేద కుటుంబాల్లో గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత కరెంట్ వ్యవసాయానికి నిరాటంకంగా అందిస్తోంది. దేశంలోనే గరిష్ట విద్యుత్‌ను సరఫరా చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో ముందుకెళుతోంది. విద్యుత్ రంగంలో పదేళ్ల విధ్వంసానికి ప్రజా ప్రభుత్వం అడ్డుకట్ట వేసి ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి తనవంతు కృషి చేస్తోంది. విద్యుత్ సంస్థల పేరిట రూ.83 వేల కోట్ల అప్పులు చేసి ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన దుస్థితి నుంచి తెలంగాణ మళ్లీ తలెత్తుకునేలా ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. రైతులకు, నిరుపేదలకు లాభసాటిగా ఉండే పథకాలను కొనసాగిస్తూనే విద్యుత్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించే ప్రయత్నం చేస్తోంది. ట్రాన్స్‌కో, జెన్‌కోతో పాటు డిస్కంలు, విద్యుత్ సంస్థల దుబారాను తగ్గించి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది.
తొలి ఏడాదిలోనే రూ. 10,444 కోట్ల ఉచిత విద్యుత్ సబ్సిడీ భారం
భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో కొత్త పునరుజ్జీవ ఇందన విధానం (రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ)ని ప్రభుత్వం రూపొందిస్తోంది. దివాళా బాటలో ఉన్న విద్యుత్ సంస్థలను గాడిలో పెట్టేందుకు తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మక విధానాలు అనుసరించింది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి భారీ అప్పులు, వేల కోట్ల నష్టాలతో విధ్వంసమైన తీరుపై శ్వేత పత్రం విడుదల చేసింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం, గతంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన వ్యవ సాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని నిరాటంకంగా కొనసాగిస్తోంది. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి ఏడాదిలోనే రూ. 10,444 కోట్లు ఉచిత విద్యుత్ సబ్సిడీ భారాన్ని భరించింది. దాదాపు 29 లక్షల మంది రైతులు ఉచిత కరెంట్ ద్వారా లబ్ధిపొందారు.
50 లక్షల కుటుంబాలకు జీరో బిల్లులు
గత పదేళ్లలో దాదాపు రూ.20 వేల కరెంటు ఛార్జీల మోత మోసిన ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. కరెంట్ ఛార్జీలను పెంచకుండా రాష్ట్రంలో 1.85 కోట్ల మంది వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం గృహజ్యోతి పథకాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులకు విద్యుత్‌ను అందిస్తోంది. మార్చి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల కుటుంబాలకు జీరో బిల్లులు అందుకున్నాయి.
గరిష్ట విద్యుత్ డిమాండ్‌లో అయిదో ర్యాంకుకు తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందించే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 39,067 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. దీనికి ప్రభుత్వం రూ. 101.57 కోట్ల సబ్సిడీని విడుదల చేసింది. రోజువారీ అధిక విద్యుత్ డిమాండ్‌లో పెద్ద రాష్ట్రాలను సైతం అధిగమించింది. గతేడాది 2023 ఆగష్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్‌లో ఎనిమిదో ర్యాంకులో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది అయిదో ర్యాంకుకు చేరింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 15,623 మెగావాట్ల ఆల్ టైమ్ హై పీక్ డిమాండ్ విద్యుత్‌ను సమర్థంగా సరఫరా చేసి కొత్త రికార్డును నెలకొల్పింది. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో సంవత్సరాలు ఆలస్యమైన యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.
రాష్ట్రంలో అవసరమైన చోట్ల 244 కొత్త సబ్ స్టేషన్లు
యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి మొదటి దశలోని రెండు యూనిట్ల నిర్మాణ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. సెప్టెంబర్ 12వ తేదీన యూనిట్ 1, 2 గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 800 మెగావాట్ల ఒక యూనిట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. దేశంలోనే వినూత్నంగా మహిళా శక్తి సంఘాల అధ్వర్యంలో 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఒక్కో సంఘం అధ్వర్యంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో మెగావాట్ ఉత్పత్తి అయ్యేలా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన అయిదు గ్రామాల్లో నూటికి నూరు శాతం సౌర విద్యుత్‌ను వినియోగించే మోడల్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. రెప్పపాటు కోత లేకుండా నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు, ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెహికల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో అవసరమైన చోట్ల 244 కొత్త సబ్ స్టేషన్లను నెలకొల్పబోతుంది.