Monday, April 21, 2025

తెలంగాణ‌కు అప్పులే పెద్ద పద్దు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రసంగించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి దశాబ్దకాలంలో ఆశించిన స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లిందని, అభివృద్ధి అడుగంటిందని అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు.

కాగా, తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ. 2,91,159 కోట్లు. మూలధన వ్యయం రూ. 33,487 కోట్లుగా ప్రసంగంలో పేర్కొన్నారు. పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు కాగా.. పన్నేతర ఆదాయం రూ. 35,208.44 కోట్లు. కేంద్ర పన్నుల్లో వాటా 26,216.28 కోట్లు. కేంద్రం గ్రాంట్లు రూ. 21,636.15 కోట్లుగా భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ ఏడాది రూ. 57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు.

అప్పులే
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ లో అప్పుల పద్దు పెద్దదిగా కనిపించింది. స్టేట్‌ ఓన్‌ ట్యాక్స్‌ రెవెన్యూ తర్వాత అప్పుల రూపంలో బడ్జెట్‌ కు చేకూరే ఆర్థిక తోడ్పాటే ఎక్కువని బడ్జెట్‌ ఎట్‌ గ్లాన్స్‌ లో ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం పద్దు రూ.2,91,159 కోట్లతో వార్షిక బడ్జెట్‌ ను కాంగ్రెస్‌ ప్రభుత్వం గురువారం అసెంబ్లీ, కౌన్సిల్‌ లో ప్రవేశపెట్టింది. మొత్తం బడ్జెట్‌ కు రెవెన్యూ రిసీట్స్‌ రూపంలో రూ.2,21,242.23 కోట్లు సమకూరుతుందని అంచనా వేసింది. ఇందులో కేంద్ర పన్నుల్లో వాటా రూపేణ రాష్ట్రానికి దక్కేది రూ.26,216.38 కోట్లుగా లెక్కగట్టారు. నాన్ ట్యాక్స్‌ రెవెన్యూ రూ.35,208.44 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.21,636.15 కోట్లు సమకూరుతుందని బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇవి పోను అప్పుల రూపంలో ఇంకో రూ. 69,572.48 కోట్లు సమకూర్చుకుంటామని వెల్లడించారు. మొత్తం అప్పుల్లో ఓపెన్‌ మార్కెట్‌ లోన్లు రూ.57.112.48 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునే రుణాలు రూ.3.900 కోట్లు, ఇతర రుణాల రూపేణ రూ. వెయ్యి కోట్లు, డిపాజిట్స్‌ ట్రాంజాక్షన్స్‌ రూపంలో రూ.4 వేల కోట్లు, లోన్స్‌ అండ్‌ అడ్వాన్సెస్‌ రూపంలో రూ.3,560 కోట్ల అప్పులు సమీకరిస్తామని బడ్జెట్​లో వివరించారు.

మొత్తం బడ్జెట్‌ లో రూ.2,20,944.81 కోట్లు రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌ గా ఖర్చు చేయనున్నారు. ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీల రూపంలో రూ.17,729.77 కోట్లు ఖర్చు చేయనున్నారు. రూ.2.91 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ పద్దు ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో కేవలం పదో వంతు మాత్రమే అభివృద్ధి కోసం ఖర్చు చేయనుంది. అంటే క్యాపిటల్‌ ఎక్స్‌ పెండిచర్‌ గా రూ.33,486.50 కోట్లు ఖర్చు చేయనుంది. ఇతర రుణాలు, అడ్వాన్స్‌ల కోసం రూ.19,626.32 కోట్లు ఖర్చు చేయనుంది. ఎఫ్‌ఆర్బీఎం పరిమితి లోబడి తీసుకున్న లోన్ల రీపేమెంట్లకు రూ.13,117.60 కోట్లు చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న లోన్‌ ల రీపేమెంట్‌ కు రూ.397.66 కోట్లు, ఇతర రుణాల చెల్లింపులకు రూ.3,486.10 కోట్లు చెల్లిస్తారు. మొత్తంగా బడ్జెట్‌ లో ద్రవ్యలోటు రూ.49,255.41 కోట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.297.42 కోట్ల బడ్జెట్‌ మిగులు ఉందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశ పెడుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు సందర్భాల్లో చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగంలోనూ ఇదే విషయాన్ని భట్టి విక్రమార్క గట్టిగా చెప్పారు. 2023– -24 బడ్జెట్‌ లో అప్పటి ప్రభుత్వం కేంద్రం నుంచి గ్రాంట్స్‌ రూపేణ రూ.41,259.17 కోట్లు వస్తాయని అంచనా వేయగా కేవలం రూ.9,729.91 కోట్లు మాత్రమే సమకూరినట్టు బడ్జెట్‌ లో ప్రతిపాదనల్లో ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత బడ్జెట్‌ లో కేంద్రం నుంచి గ్రాంట్స్‌ రూపంలో రూ.21,636.15 కోట్లుగా అంచనా వేశారు. అప్పులు తీసుకోవడానికే తాము వ్యతిరేకం అని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్‌ ప్రస్తుతం బడ్జెట్‌ రూ.12,566.23 కోట్లు అదనంగా అప్పు చేయబోతున్నట్టు బడ్జెట్‌ లో ప్రతిపాదించింది. ఆర్బీఐ నుంచి తీసుకున్న చేబదుల్లు, ఇతర అడ్వాన్స్‌ ల అప్పులు దీనికి అదనంగా లెక్కించాల్సి ఉంటుంది. 2023 -–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,11,685.23 కోట్లుగా ఖర్చు చేస్తామని ప్రతిపాదించగా వాస్తవానికి రూ.1,67,384.69 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,20,944.81 కోట్లు క్యాపిటల్‌ ఎక్స్‌ పెండిచర్‌ గా ప్రతిపాదించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com