హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక సరదా ఓ వ్యక్తి జీవితాన్ని నాశనం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ప్రియురాలిని భయపెట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమై ప్రాణాలు తీసింది. సరదాగా వేసుకున్న ఉరితాడు బిగుసుకుని క్యాబ్ డ్రైవర్ ఆదర్శ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో రెండు నెలల్లో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ విషాద ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ప్రాణాలు తీసన సరదా..
తిలక్‌నగర్‌లో నివాసముంటున్న యాకయ్య కుమారుడు ఆదర్శ్.. హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా.. నల్లకుంట ప్రాంతానికి చెందిన ఓ యువతిని అతను ఐదు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతుండటంతో ఇరు కుటుంబ సభ్యులు అంగీకరంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ నెలలో వీరిద్దరికి వివాహం చేయాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు.
మార్చి 3 సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రియురాలిని బెదిరించే ప్రయత్నం చేశాడు అదర్శ్. సరదాగా ఇంటిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఐరన్ బాక్స్ వైరుతో ఉరేసుకుంటున్నట్లు ఫొటో తీసి ఆమెకు పంపించాడు. అయితే.. ఉరి వేసుకుంటున్నట్లు చూపించే సమయంలో పొరపాటుగా వైరు ఆదర్శ్ మెడకు గట్టిగా బిగుసుకుపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. ఊపిరాడక అక్కడికక్కడే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి సమయంలో అదర్శ్ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.