Friday, September 20, 2024

పారాహుషార్…!

  • పంక్షన్‌లు, పార్టీలు చేస్తున్నారా జాగ్రత్త…?
  • కచ్చితంగా మద్యం పార్టీ కోసం అనుమతి తీసుకోండి…
  • ఆ పార్టీలో ఇతర రాష్ట్రాల బ్రాండ్‌లను వాడితే కేసుల నమోదు
  • ముమ్మరంగా దాడులు చేస్తున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
  • నాలుగు నెలల్లో 302 కేసులు
  • పలు జిల్లాలో అనుమతి లేకుండానే మద్యం పార్టీలు
  • రానున్న రోజుల్లో ఆ మద్యం పార్టీలపై ఎక్సైజ్ శాఖ నిఘా
  • నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సరఫరా చేసినా, విక్రయించినా, తాగినా జైలుకే…
  • ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను అప్రమత్తం చేసిన ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు

పంక్షన్‌లు, పార్టీలు చేస్తున్నారా జాగ్రత్త…? ఆయా పార్టీల్లో, పంక్షన్‌లలో మద్యం పార్టీ ఉంటే కచ్చితంగా ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోండి. దీంతోపాటు ఆ పార్టీలో తెలంగాణ మద్యాన్ని మాత్రమే వాడండి. మిగతా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన బాటిళ్లను వాడారా దానిని సరఫరా చేసిన వారు, ఆ మద్యాన్ని తాగిన వారు, ఆ పంక్షన్ హాల్ యజమానులపై సైతం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే నాలుగు నెలల్లో ఇలాంటి కేసులు సుమారుగా 302 కేసులను నమోదు చేసి పలువురిని అరెస్టు చేసింది. ఈ పంక్షన్‌లకు సంబంధించి అనుమతులు కూడా జంట నగరాల పరిధిలోనే ఎక్కువగా తీసుకుంటున్నారని, మిగతా ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా అనుమతులు తీసుకోకుండా మద్యం పార్టీలను నిర్వహిస్తున్నారని ఎక్సైజ్ శాఖ గుర్తించింది. అందులో భాగంగా రానున్న రోజుల్లో శుభముహూర్తాలు అధికంగా ఉండడం ఆయా పంక్షన్‌లలో మద్యం పార్టీలను అనధికారికంగా నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ విషయమై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఎక్సైజ్ శాఖ సూచిస్తుంది.

ఎన్పీడిఎల్‌తో తెలంగాణకు నష్టం
ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైనా పంక్షన్ అయితే ఆ పంక్షన్‌లో మద్యం పార్టీ ఉంటే కచ్చితంగా ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలన్న నిబంధనను చాలామంది తుంగులో తొక్కుతున్నారు. ఒకవేళ అనుమతి తీసుకున్నా ఆ పార్టీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్పీడిఎల్) ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని వినియోగిస్తున్నట్లు అబ్కారీశాఖ దృష్టికి వచ్చింది. దీనివల్ల నష్టం వాటిల్లుతోందని ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈవెంట్‌లపై నజర్ పెట్టాలని ఎక్సైజ్ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటికే డ్రగ్స్, నాటుసారా రవాణా, వినియోగం, తయారీపై ఉక్కుపాదం మోపుతున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రానున్న రోజుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను రవాణా చేసే, విక్రయించే వారిని, వాడే వారిని సైతం గుర్తించి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

శంషాబాద్ ఎక్సైజ్ పరిధిలో 4,729 అనుమతులు…
2023, 24 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంక్షన్‌లలో మద్యం పార్టీ కోసం 14,508 మంది అనుమతి తీసుకున్నారు. ఈ పార్టీలు ఎక్కువగా హైదారాబాద్ పరిధిలోనే జరిగాయి. ఒక్క హైదరాబాద్ డివిజన్‌లోని శంషాబాద్ ఎక్సైజ్ పరిధిలో 4,729 పంక్షన్లకు ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇచ్చింది. దీంతోపాటు సరూర్‌నగర్ 2,990 ఈవెంట్‌లు, మేడ్చల్ పరిధిలో 1,873, మల్కాజిగిరిలో 1,522, హైదరాబాద్‌లో 790 అనుమతులను ఇచ్చారు. మిగిలిన అన్ని జిల్లాలో 100 నుంచి 150 అనుమతులు తీసుకున్నారు. 2022,23 సంవత్సరంలో 13,565 పంక్షన్‌లలో మద్యం పార్టీ కోసం అనుమతులు తీసుకున్నారు. 2024 సంవత్సరంలో ఒక్క మే నెలలోనే 847 అనుమతులు తీసుకున్నారు. ఈ మద్యం పర్మిట్ అనుమతులతో ఎక్సైజ్ శాఖకు అదానపు ఆదాయంతో పాటు మద్యం అమ్మకాలకు గిరాకీ పెరిగింది.

నాలుగు నెలల్లో 302 కేసులు నమోదు
ఇక్కడే అసలు మోసం బయటపడింది. ఎక్సైజ్ శాఖ ఆదాయానికి నిర్వాహకులు గండికొడుతున్నట్టుగా ఆ శాఖ గుర్తించింది.మద్యం కోసం అనుమతులు తీసుకున్న నిర్వాహకులు, ఈవెంటర్‌లు కొద్దిపాటిగా తెలంగాణ మద్యాన్ని కొనుగోలు చేసి మిగతాది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగిస్తూ తెలంగాణ ఆబ్కారీ శాఖ ఆదాయానికి గండికొడుతున్నారు. గోవాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మద్యాన్ని తక్కువ ధరలకు కొనుగోలు చేసి తీసుకొచ్చి ఆయా పార్టీల్లో మద్యాన్ని వినియోగిస్తున్నారు. ఈ విషయమై భారీగా ఫిర్యాదులు రావడంతో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ఈ మధ్య కాలంలో దాడులు ముమ్మరం చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు నాలుగు నెలల్లో 302 కేసులు నమోదు చేశారు. 165 మందిపై కేసుల నమోదు చేసి, 35 వాహనాలు సీజ్ చేసి రూ. 61.13 లక్షల విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశారు.

ఈవెంట్లపై దృష్టి సారించండి: ఉన్నతాధికారులు
రానున్న రోజుల్లో శుభకార్యాలు అధికంగా ఉండడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు నిఘాను మరింత పెంచాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డిలు అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. విందులు, వినోద కార్యక్రమాల్లో మద్యం వినియోగం కోసం అనుమతి తీసుకున్న ఈవెంట్లపై దృష్టి సారించాలని అధికారులను వారు అదేశించారు. ఒకటి రెండు నెలలు ప్రత్యేక డ్రైవ్ చేసి ఎన్డీపిఎల్‌ను అరికట్టాలని వారు సూచించారు. ఎన్డీపిఎల్ మద్యం వినియోగిస్తే కేసులు నమోదు చేయాలని వారు అధికారులను ఆదేశించారు.

కేసులు నమోదు చేస్తాం
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి
అనుమతి లేకుండా ఇలాంటి చర్యలు చేపడితే కేసులు నమోదు చేస్తాం. పార్టీ కోసం మద్యం అనుమతి తీసుకున్న పంక్షన్‌లలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను వినియోగిస్తే కఠినచర్యలు తీసుకుంటాం. పంక్షన్ నిర్వహించే వ్యక్తి, ఎన్డీపిఎల్ మద్యాన్ని సరఫరా చేసిన వారిపై, ఈ మద్యాన్ని వినియోగించిన ఫంక్షన్ హాల్ యజమానిపై కేసులు నమోదు చేస్తాం. మద్యం వినియోగం అనుమతి ఉన్న పంక్షన్‌లపై ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుంది. అక్కడ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగిస్తే కేసులు నమోదు చేస్తారు. నిత్యం జరిగే ఈవెంట్‌లపై ఎక్సైజ్ యంత్రాంగం నిఘా పెట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Aamna Sharif latest stills

Surbhi Jyothi Glam Pics

Rashmika Mandanna New Pics

Ritu Sharma Latest Photos