గద్వాల్ ఎమ్మెల్యే ఘర్ వాపసీకి రెడీ అయ్యారు. అసెంబ్లీ లాబీల్లోని ఎల్‌వోపీ చాంబర్ లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తాను పార్టీలోనే కొనసాగుతానని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తనను నమ్మించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అవమానించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణమోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించిన కేటీఆర్ పార్టీ చీఫ్ కేసీఆర్ కలవాలని సూచించారు. అసెంబ్లీ నుంచి కృష్ణమోహన్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసేందుకు బయల్దేరారు. బీఆర్‌ఎస్ బీఫాంపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరే వరకు ఇచ్చిన గౌరవం, కండువా కప్పుకున్న తర్వాత వారికి దక్కడం లేదు. బడ్జెట్ సమావేశాల్లోపే బీఆర్‌ఎస్ ఎల్పీ సీఎల్పీలో విలీనమవుతుందని నమ్మబలికితేనే పది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వీడకపోవడం, అసెంబ్లీలో ఏదో ఒక మూలన కూర్చోవాలని సీఎం చెప్పడంతో దానిని పార్టీ మారిన ఎమ్మెల్యేలు అవమానంగా ఫీలవుతున్నారు. ఈనేపథ్యంలో పలువురు తిరిగి బీఆర్‌ఎస్ గూటికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్పీ మెర్జర్ కాకపోతే ఎమ్మెల్యే పదవి పోతుందని, మళ్లీ ఉప ఎన్నికలు ఎదుర్కోవడం అంత సులువు కాదన్న అభిప్రాయం ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే పదవిని కాపాడుకోవడంతో పాటు సొంత పార్టీలో కొనసాగితే కనీసం గౌరవమన్న దక్కుతుందన్న అభిప్రాయం పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఉంది. కొన్ని రోజుల క్రితం ప్రజాభవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని నిల్చోబెట్టారు. ఈ ఘటనతో ఆయన నొచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడి తిరిగి బీఆర్‌ఎస్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు.