ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా శుక్రవారం ఉదయం కలిశారు. సిఎంను మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు కలిశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్‌ఎస్‌లోకి మారబోతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి చెక్ పెట్టినట్టేనని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
రెండు రోజుల క్రితం పోచారం నివాసంలో విందు
మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో రెండు రోజుల క్రితం బిఆర్‌ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా విందు, రాజకీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కూడా గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో గురువారం ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. చర్చలు సఫలం కావడంతో శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సిఎం నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డిని కృష్ణ మోహన్ రెడ్డి కలవడంతో కథసుఖాంతం అయ్యింది.