కర్ణాటకలో ఇనుప గనుల్లో అక్రమ తవ్వకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, ప్రస్తుత గంగావతి ఎమ్మెల్యే, ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డికి ఎట్టకేలకు మోక్షం లభించింది. సుధీర్గ కాలం అంటే 13 ఏళ్ల తరువాత తన సొంత జిల్లా బళ్లారి వెళ్లడానికి గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. బళ్లారిలో గనుల తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 2011 సెప్టెంబరు 5న సీబీఐ గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తరలించింది. మూడేళ్లకు పైగా హైదరాబాద్, బెంగళూరు జైళ్లలో ఆయన శిక్ష అనుభవించారు. ఆ తరువాత గాలి జనార్ధన్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. బళ్లారి, ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి ఆయన గంగావతి, బెంగళూరు నగరంలో ఉంటూవస్తున్నారు. ఇప్పుుడు 13 ఏళ్ల తరువాత బళ్లారి వెళ్లేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.