ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. భర్తను చితక్కొట్టి, అతని భార్యపై ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఏలూరులో చోటుచేసుకోగా.. మూడు పోలీసుస్టేషన్లకు కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది.
జీవనోపాధి కోసం వచ్చి రామకోటిలో ఉంటున్న ఈ జంటకు జులాయిగా తిరిగే ఈ యువకులు పరిచయమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి మహిళ భర్తతో కలిసి మద్యం సేవించారు ఉన్మాదులు. ఆ పక్కనే అతని భార్య నిద్రిస్తోంది. మద్యం ఎక్కువయ్యాక అతడిపై దాడి చేసి, భార్యను కొద్ది దూరం లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె ముఖంపై దాడిచేశారు. ఈ అఘాయిత్యాన్ని అడ్డుకోలేని భర్త కేకలు వేస్తూ పక్కనే ఉన్న రోడ్డుపైకి వచ్చి అటుగా వెళ్తున్న యువకుడికి విషయం చెప్పి రక్షించాలని కోరాడు.
ఆ యువకుడు స్పందించి ఘటనా స్థలానికి వస్తుండగా నిందితులు ముగ్గురూ పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెంచుల కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, లంబాడీపేటకు చెందిన నారపాటి నాగేంద్ర, మరడాని రంగారావు కాలనీకి చెందిన గడ్డి విజయ్‌కుమార్ అలియాస్ నానిలను వన్‌టౌన్ ఎస్సై లక్ష్మణ్‌బాబు, సిబ్బంది అరెస్టు చేశారు.వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు.