ఇల్లీగల్ దందాలో సీఐలకు లక్షన్నర, ఎస్‌ఐలకు రూ.50 వేలు
నానక్‌రాంగూడ లేడీ డాన్ నీతూబాయి చీకటి దందాలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె మత్తు దందాకు కొందరు ఎక్సైజ్ అధికారులు కూడా సహకరించినట్లు తెలిసింది. నెలవారీ మామూళ్లు తీసుకొని గంజాయి దందాకు వత్తాసు పలికినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల ర్యాంకును బట్టి ఆమె నెలనెలా మామూళ్లు పంపించేదని విచారణాధికారులు గుర్తించారు. సాప్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్‌గా హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో గంజాయి దందా చేస్తున్న లేడీ డాన్ నీతూబాయ్ విషయంలో కీలక అంశాలను బయటకు తీస్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో శాఖలో ఓ సీఐ, కొందరు ఎస్‌ఐలు లంచాలు తీసుకున్నట్లు లేడీ డాన్ ఒప్పుకున్నది. అధికారులు నీతూబాయితో ఒప్పందం చేసుకుని నెలవారీగా మామూళ్లు వసూళ్లు చేశారు. సీఐ, ఎస్‌ఐలకు వాటా పంపిస్తే క్వింటాళ్ల కొద్దీ గంజాయి అమ్మినా పట్టించుకోకుండా వదిలేసినట్లు తేలింది.
ర్యాంకును బట్టి లంచం
నీతూబాయి దాదాపు ఎనిమిదేళ్లుగా గంజాయి దందా చేస్తుండగా.. అధికారుల ర్యాంకును బట్టి మామూళ్లు పంపిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇన్‌స్పెక్టర్ నెలకు రూ.లక్ష, ఎస్‌ఐలకు నెలకు రూ.50 వేల చొప్పున పంపించినట్లు తేలింది. ఇటీవల ఓ ఇన్‌స్పెక్టర్ ఏకంగా రూ.లక్షన్నర ఇవ్వాలని నీతూబాయితో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ అధికారుల అండదంటలతోనే.. నీతూబాయి గుట్టు చప్పుడు కాకుండా మత్తు దందా చేస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నీతూబాయి పరారీలో ఉండగా.. ఆమెను పట్టుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
ధూల్‌పేట ప్రాంతానికి చెందిన నీతూబాయి గతంలో గుడుంబా దందా చేసేది. ఆ తర్వాత వీరి కుటుంబం నానక్‌రాంగూడ లోథాబస్తీకి మకాం మారింది. ఐటీ కారిడార్‌ను అడ్డాగా చేసుకొని నీతూబాయి గంజాయి దందా సాగిస్తోంది. భర్త, ఇద్దరు కుమారులతో కలిసి ఐటీ ఉద్యోగులకు గంజాయి విక్రయిస్తున్నారు. నీతూబాయి ప్రతిరోజూ సగటున రూ.2-4 లక్షల సరకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఒడిశాలో కిలో గంజాయి రూ.8 వేలకు తీసుకొచ్చి 5, 10 గ్రాములుగా పొట్లాల్లో గంజాయిని నింపుతారు. ఆ తర్వాత 5 గ్రాముల పొట్లాన్ని రూ.500, 10 గ్రాముల పొట్ల రూ.1000 చొప్పున విక్రయిస్తారు. ఎనిమిదేళ్ల కాలంలోనే నీతూ బాయి కోట్లకు పడగలెత్తింది. ఆమె ఆస్తులు దాదాపు 5 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ప్రస్తుతం నీతూ బాయి పరారీలో ఉండగా.. ఆమెను అదుపులోకి తీసుకుంటే అధికారుల బాగోతం బయటపడే ఛాన్స్ ఉంది.