రాష్ట్రంలో గ్రూప్-–1 అభ్యర్థులు మళ్లీ న్యాయపోరాటానికి దిగారు. గ్రూప్–-1 మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలని ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్-1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 18 రకాల సబ్జెక్టులుంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లను దిద్దించారని, మూడు భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.
ఒకే మాధ్యమంలో నిపుణులైన వారితో తెలుగు, ఇంగ్లిష్ మీడియం పేపర్లు మూల్యాంకనం చేయించారని, అలా చేయడం వల్ల మూల్యాంకనంలో నాణ్యత లోపించిందని, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది.