- డెంగ్యూ నివారణకు ప్రత్యేక దృష్టి
- జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. గురువారం తన ఛాంబర్ లో జోనల్ కమిషనర్లతో సమీక్ష సమావేశాన్ని అమ్రపాలి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జోనల్ కమిషనర్ లతో పాటు డిప్యూటీ కమిషనర్లు కూడా తమ తమ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికతో పాటు సంబంధిత ఫోటోలు కూడా పంపించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఒక్కొక్క అంశం పై ప్రజలకు వివరించడమే కాకుండా మీడియా లో కూడా అట్టి విషయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
డెంగ్యూ నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని అవసరమనుకుంటే అందుకు ఐఈసి కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత ఎంటమాలజి సిబ్బంది ఇంటింటికీ వెళ్లి దోమల నివారణ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం డ్రై డే గా ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి నెల కేటాయించిన టాక్స్ వసూళ్లు చేయాలని, టాక్స్ వసూలు చేసిన శాతం ప్రకారం నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. శానిటేషన్, సి అండ్ డి పై కూడా అధికారులు దృష్టి సారించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, రవి కుమార్, ఉపేందర్ రెడ్డి, పంకజ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.