Tuesday, November 19, 2024

పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి

  • 15 రోజుల్లోగా నివేదికను అందించాలి
  • తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై చర్యలు తీసుకుంటాం
  • రోడ్లతో పాటు చెత్త సేకరణపై జీహెచ్‌ఎంసిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి
  • రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించవద్దు
  • గ్రేటర్ హైదరాబాద్‌ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా
  • తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి
  • మున్సిపల్ విభాగం అధికారులు ఇండోర్‌కు వెళ్లి అధ్యయనం చేయాలి

పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి 15 రోజుల్లోగా పూర్తి నివేదికను అందించాలని సిఎం ఆదేశించారు. తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ అభివృద్ధితో పాటు జీహెచ్‌ఎంసి పరిధిలో రోడ్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ మున్సిపల్ విభాగం అధికారులు ఇండోర్‌కు వెళ్లి అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. అక్కడ అనుసరిస్తున్న విధానాలను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. ఏయే ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థలు అక్కడ పనుల్లో పాలుపంచుకున్నాయో తెలుసుకొని చర్చలు జరపాలని, వీలైతే వారిని భాగస్వాములను చేయాలని సిఎం సూచించారు. క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఇండోర్ కార్పొరేషన్ ఆదాయ వనరులెలా సమీకరిస్తుందన్న వివరాలు కూడా తెలుసుకోవాల న్నారు.

811 కి.మీల రోడ్ల నిర్వహణను పట్టించుకోలేదు…
హైదరాబాద్‌లో అయిదేళ్ల క్రితం కాంప్రహెన్సీవ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద 811 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టారని, వాటి నిర్వహణను మాత్రం పట్టించుకోవటం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌తో కాంట్రాక్టు గడువు ముగిసిపోతుందని, అందుకే రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. గడువులోగా అన్ని రోడ్ల పనులను పర్యవేక్షించి, వెంటనే బాగు చేయించాలని సిఎం సూచించారు.

రోడ్లతో పాటు చెత్త సేకరణపై జీహెచ్‌ఎంసీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. అవసరమైతే జీఐఎస్, క్యూ ఆర్ స్కాన్ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సిఎం చెప్పారు. జీహెచ్‌ఎంసిలో నిరంతరం జరిగే పనులకు ఆర్థిక ఇబ్బంది లేకుండా నిధుల సమీకకరణకు కూడా స్పష్టమైన ప్రణాళికలు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

బకాయిల చెల్లింపునకు నిధులను తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోవాలి
ఇప్పుడున్న బకాయిల చెల్లింపులకు అవసరమైన నిధులను తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోవాలని చెప్పారు. ఆదాయం పెంచుకునే మార్గాలతో పాటు, ఇప్పుడున్న లొసుగులను సవరించుకోవాలని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఆస్తుల నుంచి వచ్చే అద్దెలు, అడ్వర్టయిజ్‌మెంట్లు, హోర్డింగ్‌ల ద్వారా ఆదాయం వస్తుందా లేదా కూడా పర్యవేక్షించాలని సిఎం ఆదేశించారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మూసీ పరివాహక ప్రాంతంలో సేకరించే స్థలాల్లో ఉన్న నివాసితులకు పునరావాసం కల్పించాలని సిఎం స్పష్టం చేశారు. తమకు అన్యాయం జరిగిందని నిర్వాసితులు బాధ పడకుండా, వారికి భరోసా కల్పించాలని సిఎం రేవంత్ సూచించారు. పునరావాస కాలనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయా లేదా అని అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సిఎం ఆదేశించారు.

స్టేషన్‌కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలి
చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను అధునీకరిస్తున్నందున, పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్‌కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పరిసరాల్లో ఉన్న అటవీ శాఖ భూమిని, పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అక్కడున్న పరిశ్రమలను మరో చోటికి తరలించాలని సిఎం రేవంత్ సూచించారు. స్టేషన్ ముందు పార్కింగ్, కమర్షియల్ జంక్షన్ కు వీలుగా అప్రోచ్ రోడ్లు డిజైన్ చేసుకోవాలని సిఎం ఆదేశించారు.

ఈ సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రాపాలి, సిఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular