సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రగ్డ్‌గా, ఇంటెన్స్ డ్రామాతో ‘జాతర’ తెరకెక్కింది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే జాతర నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 8న థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను తన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో, దర్శకుడు సతీష్ బాబు రాటకొండ.
– దేవుడు మనుషులను బొమ్మలుగా చేసి జగన్నాటకం ఆడిస్తాడని మన పురాణాల్లో చెబుతుంటారు. ఇందుకు భిన్నంగా ఒక మనిషి దేవుడిని పితలాటకం ఆడిస్తుంటాడు. ఆ పితలాటకం నుంచి అమ్మవారిని హీరో ఎలా రక్షిస్తాడు అనేది ఈ చిత్ర మూల కథాంశం. మనిషి రాక్షసుడై అమ్మవారిని చెరపడితే మరో నరుడు హరుడై ఆ రాక్షసుడిని ఎలా సంహరించాడు అనేది మా ‘జాతర’ చిత్రంలో చూపిస్తున్నాం. వాస్తవ ఘటనల ఆధారంగా ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించాను. ఈ చిత్రాన్ని డాక్యుమెంటరీగా తీస్తే వివాదాలు వస్తాయి. సినిమా అయితే క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందించవచ్చు అనిపించింది.
– హీరో క్యారెక్టర్ మూడు డైమెన్షన్స్ లో ఉంటుంది. అతను ఒక ఫేజ్ నుంచి మరో ఫేజ్ కు వెళ్లేందుకు ప్రేమ అనేది ఒక మీడియంలా ఉంటుంది. అలా ఈ కథలో ఓ మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది. మంచి సౌండ్ డిజైనింగ్ ఈ మూవీ కోసం చేశాం. మనం జంధ్యాల సినిమాల్లో విన్నట్లు విలేజ్ లో వినిపించే సహజమైన సౌండ్స్ తరహాలో ‘జాతర’ చిత్రంలో సౌండ్ డిజైనింగ్ చేయించాం.
– చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర గ్రామాల్లో ఈ అమ్మవారి గుడి ఉంటుంది. చుట్టుపక్కల 18 ఊళ్ల ప్రజలు ఈ గుడికి వచ్చి అమ్మవారిని కొలుస్తారు. ఏడాదిన్నర పాటు ఆ ప్రాంతంలో ప్రజలతో ఇంటరాక్ట్ అయి, రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ చేసుకున్నాం. గంగమ్మతల్లిని తెలుగు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆ అమ్మవారి గురించి తీసిన చిత్రమే ‘జాతర’.