-
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
హైదరాబాద్ లో ౩ వేలు తగ్గిన పసిడి
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి కోతలు విధించడంతో విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. మరీ ముఖ్యంగా బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గిస్తూ బడ్జెట్లో ప్రకటన చేసింది. బంగారం, వెండి వస్తువులు సహా ఇతర లోహాలపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయంతో బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ, దేశీయంగా మాత్రం భారీగా తగ్గాయి.
భారత్ లో 10 గ్రాముల బంగారం ధర ఇంట్రాడేలో సుమారు ౩ వేల రూపాయల వరకు తగ్గగా, వెండి ధర కూడా భారీగానే పడిపోయింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర 2750 తగ్గగా.. ప్రస్తుతం 64,950 ధర పలుకుతోంది. ఇక 24 క్యారెట్స్కు చెందిన స్వచ్ఛమైన బంగారం ధర 2990 తగ్గగా 10 గ్రాములకు 70,860 కి దిగొచ్చింది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి 3500 రూపాయలు తగ్గగా ప్రస్తుతం కిలో 92,500 వద్ద ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 2750 పడిపోయి 65,100 పలుకుతోంది. ఇక 24 క్యారెట్స్ పసిడి ధర 10 గ్రాములు 71,010 గా ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర 88 వేల వద్ద ఉంది. గత 5 రోజుల్లో ఏకంగా 8 వేల రూపాయలు పతనం కావడం విశేషం. కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి బంగారు, వెండి ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.