వంట గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ హామీని అమలు చేస్తోంది రేవంత్ సర్కార్. ఈ పథకంలో ముందుగా గ్యాస్ సిలిండర్ కు పూర్తి నగదు చెల్లిస్తే ప్రభుత్వం సబ్సిడీ డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో జమచేస్తుంది ప్రభుత్వం. ఐతే సదరు గ్యాస్ సిలిండర్ కు సంబందించిన సబ్బీడీ పైసలు ఎప్పుడు పడుతున్నాయన్నది క్లారిటీ లేకపోవటంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. రాష్ట్రంలో చాలా వరకు నెల రోజులు గడిచినా సబ్సిడీ డబ్బులు బ్యాంకు అకౌంట్స్ లో పడకపోవటం, మరికొందరికి అసలు సబ్బిడీ డబ్బులే రాకపోవటంతో తాము అర్హులమా కాదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ అంశంపై ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చించారు. వినియోగదారులకు సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల వ్యవధిలోనే వారి బ్యాంకు ఖాతాలోకి సబ్సిడీ నగదు జమ కావటంతో పాటు, మొబైల్‌కు మెస్సేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించారు. దీంతో ఇకపై గ్యాస్ సిలిండర్ డెలివరి అయిన 48 గంటల్లోనే సబ్సిడీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయి.