వాహనదారులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. చాలా కాలగా పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గుతాయాలనే చర్చ జరుగుతున్నా.. కేంద్రం మాత్రం ఇప్పటివరకు అలాంటి ప్రకటనేది చేయలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందుగా మార్చి 2024లో ఇంధన ధరలు తగ్గించింది మేదీ సర్కార్. ఆ తరువాత గత ఆరు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలపై అసలు ఊసే లేదు. కొన్ని రోజులు క్రితం, పెట్రోలియం శాఖ సెక్రటరీ పంకజ్ జైన్ మాట్లాడుతూ, చమురు మార్కెటింగ్ కంపెనీలు ముడి చమురును ఎంతకాలం తక్కువ ధరకే ఇస్తాయో, ఇంధన ధరలను తగ్గించడానికి పరిశీలించవచ్చునని పేర్కొన్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది.
భారత్ దిగుమతి చేసుకుని క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఈ ఏడాది మార్చిలో 83-84 డాలర్లుగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ లీటరుపై 2 రూపాయలు తగ్గించింది. ఇక ఇప్పుడు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 74 డాలర్లకు పడిపోయిందని ఇక్రా సంస్థ పేర్కొంది. దీంతో పెట్రోల్, డీజిల్ లీటరుకు 2 నుంచి 3 రూపాయల చొప్పున తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వచ్చే వారం జరిగే మంత్రివర్గ సమావేశంలో పెట్రోల్-డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని బావిస్తున్నారు.