గూగుల్.. ఇప్పుడు ఎవరికి ఏ సమాచారం కావాల్సినా ఆశ్రయించేది గూగుల్ నే. ఇక ఎక్కడికి వెళ్లాలన్నా చూసేది గూగుల్ మ్యాప్ నే. మనం ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ లో సెట్ చేస్తే సరిగ్గా అక్కడికి తీసుకెళ్తుంది. కానీ ఒక్కోసారి మాత్రం గూగుల్ మ్యాప్ తికమక పెడుతుంది. ఇదిగో తాజాగా గూగుల్ మ్యాప్ ఓ తల్లీ కొడుకును ప్రమాదంలోకి నెట్టింది. గూగుల్ మ్యాప్ సాయంతో ప్రయాణిస్తున్న యువకుడు, అతడి తల్లి వరదలో చిక్కుకుపోయారు. విజయవాడ రూరల్ మండలం నున్నకు చెందిన కైలే గౌతమ్ వైద్య విద్యార్థి విజయవాడలో పీజీ చదువుతున్నాడు.
వరదలు, వర్షాల కారణంగా పది రోజులుగా ఇంటికి వెళ్లడం కుదరలేదు. యనమలకుదురులోని బంధువులు, స్నేహితుల గదిలో ఉంటూవస్తున్నాడు. శుక్రవారం కాస్త వాతావరణం కుదుటపడటంతో గౌతమ్ సొంత ఊరికి వెళ్లేందుకు సిద్దమయ్యాడు. గన్నవరం మండలం పురుషోత్తపట్నం మీదుగా నున్న వెళ్లి, తల్లి రమా కుమారిని తీసుకుని తిరిగి విజయవాడకు బయల్దేరారు. గూగుల్ మ్యాప్ సాయంతో విజయవాడకు వస్తుండగా.. ఆ మ్యాప్ సావరగూడెం- కేసరపల్లి మీదుగా చూపించింది. గూగుల్ చెప్పినట్లుగా రూట్ లో వస్తుండగా వరద వస్తుందన్న విషయం తెలియకపోవడంతో తన కారుతో 150 మీటర్ల దూరం ముందుకొచ్చాడు. ఐతే వరద ఎక్కువగా ఉండటంతో కారును వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ కారు ఇంజిన్ ఆగిపోయింది. కనీసం కారు డోర్లు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఎంతసేపటికి కారు డోర్లు, అద్దాలు తెరుచుకోకపోవడంతో కంగారు పడిపోయిన గౌతమ్.. స్నేహితులకు, తెలినవారికి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మార్వో తమ రెవెన్యూ సిబ్బందితో పాటు పంచాయతీ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించారు. గ్రామంలోని గజ ఈతగాడి సాయంతో కారు అద్దాలు పగలగొట్టి గౌతమ్, అతడి తల్లి రమా కుమారిని సురక్షితంగా వరద నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ తరువాత కాసేపటికి కారు వరదలో కొట్టుకుపోయింది. అదన్నమాట సంగతి.. గూగుల్ మ్యాప్ ఎంతపని చేసిందని అందరూ అవాక్కైపోయారు. సరైన టైంలో స్పందించింది, తమను రక్షించిన గన్నవరం తహశీల్దార్‌కి గౌతమ్, అతని తల్లి కృతజ్ఞతలు చెప్పారు.