Wednesday, May 7, 2025

వాణిజ్య పన్నుల శాఖపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

  • ప్రభుత్వానికి ప్రతిరోజు రాబడుల నివేదికలు
  • ఎన్నికల తరువాత 20 మంది ‘కమర్షియల్’ అధికారులపై వేటు
  • నకిలీ ఇన్ వాయిస్‌లపై ప్రభుత్వం ప్రత్యేక నజర్
  • జీఎస్టీ ఎగవేతదారులను గుర్తించి వారికి జరిమానా విధించేలా చర్యలు
  • అధిక ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు

వాణిజ్య పన్నుల శాఖపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతిరోజు రాబడులకు సంబంధించిన నివేదికలు తెప్పించుకోవడంతో పాటు ఎక్కడెక్కడ ఆదాయం తగ్గింది, గతంలో ఎక్కడ ఆదాయం ఎక్కువగా ఉండేది, ప్రస్తుతం ఎక్కడ పెరిగింది, ఎక్కడ తగ్గిందన్న విషయాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈసారి ఆశించిన మేర ఆదాయం రాకపోవడం అధికారులు సైతం అందినకాడికి దోచుకోవడంతో ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే జీఎస్టీ ఎగవేతదారులపై చర్యలు చేపట్టిన ఆ శాఖ అధికారులు ఆదాయం పెంపుపై ప్రణాళికలు చేపట్టారు. వ్యాపారులతో కుమ్మక్కై రోజు వారి ఆదాయాన్ని కొల్లగొడుతున్న అధికారుల చిట్టాను కూడా ప్రభుత్వం రూపొందించినట్టుగా తెలిసింది. ఇప్పటికే నకిలీ ఇన్ వాయిస్‌లు పెట్టిన బోగస్ సంస్థలకు కోట్లాది రూపాయిలు రీఫండ్‌లు ఇచ్చిన దాదాపు 20 మంది అధికారులపై వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు కాగానే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా సమాచారం. గతేడాది ఇదే నెలలో ఎంత ఆదాయం వచ్చిందన్న దానిపై అధికారులు లెక్కలు తీసినట్టుగా తెలిసింది. ఎలాంటి పన్నులు విధించకుండా రాబడులు పెంచుకునేందుకు అవకాశాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాణిజ్య పన్నుల శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.

2023లో కేంద్రం నుంచి ఆగిపోయిన పరిహారం
2023, 24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో జీఎస్టీ రాబడులు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2023-, 24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ జాతీయ సగటు పెరుగుదల 13 శాతం కాగా, రాష్ట్రంలో మాత్రం ఏడు శాతంగా నమోదైంది. దీంతో వ్యాట్ రాబడి తగ్గడం, జీఎస్టీ పరిహారం లేకపోవడంతో మొత్తం మీద వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం తగ్గింది. వ్యాట్ ఆదాయం తగ్గడంపై లోతైన పరిశీలన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు, 14 శాతం కంటే తక్కువ వార్షిక వృద్ధి వచ్చిన రాష్ట్రాలకు కేంద్రం పరిహారం చెల్లించింది. ఈ విధంగా 2017 జులై నుంచి 2022 జూన్ వరకు పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.

ఐదేండ్లు గ్రేస్ పీరియడ్ పూర్తి కావడంతో అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఆగిపోయింది. ఆ ఐదు సంవత్సరాల్లో పరిహారం పెండింగ్ ఉన్న రాష్ట్రాలకు చెల్లింపులు విడుదలవుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో 2022,-23 ఆర్థిక ఏడాదిలో జీఎస్టీ పరిహారం కింద బకాయి ఉన్న మొత్తంలో, రూ.4,419 కోట్లు కేంద్రం నుంచి విడుదలైంది. 2023,-24 సంవత్సరంలో కేవలం రూ.625 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో గతేడాది కంటే తక్కువ జీఎస్టీ పరిహారం రావడం, జీఎస్టీ రాబడులు ఆశించిన మేరకు పెరగకపోవడం, వ్యాట్ రాబడి పెరగకుండా తగ్గింది. దీంతో మొత్తం వాణిజ్య పన్నుల రాబడి తగ్గింది. దీంతోపాటు వ్యాపారులతో అధికారులు కుమ్మక్కు కావడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గినట్టుగా ప్రభుత్వం గుర్తించింది.

2022-,23లో రూ.72,564 కోట్ల ఆదాయం
తెలంగాణలో గడిచిన నాలుగేండ్లుగా వచ్చిన రాబడులను పరిశీలిస్తే 2020,-21 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.52,436 కోట్లు కాగా, 2021-,22లో రూ.65,021 కోట్లుగా ఉంది. ఇక 2022-,23లో రూ.72,564 కోట్లుగా నమోదైంది. 2023-,24 ఆర్థిక ఏడాదిలో వసూళ్లు స్వల్పంగా తగ్గి రూ.72,157 కోట్లకే పరిమితమైంది. అంతకు ముందు ఏడాది కంటే గత ఆర్థిక ఏడాదిలో కనీసం 14 శాతం ఆదాయం పెరగాల్సి ఉండగా మొత్తం మీద దాదాపు రూ.407 కోట్ల రాబడి తగ్గింది. 2023-,24 ఆర్థిక ఏడాదిలో వాణిజ్య పన్నుల శాఖ నుంచి రూ.83,500 కోట్లు రాబడి రావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ కేవలం రూ.72,157 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే 2023,-24 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యంలో రూ.11,343 కోట్ల మేర ఆదాయం తగ్గింది. ఇందులో జీఎస్టీ కింద రూ.44,000ల కోట్లు వస్తుందని అంచనా వేయగా, రూ.40,650 కోట్లు మాత్రమే వచ్చింది. మద్యం, పెట్రోల్, డీజిల్ విక్రయాలపై రూ.39,500 కోట్ల వ్యాట్ రాబడి వస్తుందని అంచనా వేయగా, రూ. 29,985 కోట్లు మాత్రమే వచ్చాయి.

ఈ జనవరి నుంచి మార్చి వరకు రూ.19,069 కోట్ల ఆదాయం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు రూ.19,069 కోట్ల ఆదాయం వచ్చింది. జనవరిలో రూ.6,076 కోట్లు, ఫిబ్రవరిలో రూ.6,240 కోట్లు, మార్చిలో రూ.6,753 కోట్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ శాఖకు సక్రమంగా ఆదాయం రాకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జీఎస్టీ రాబడులు తగ్గడానికి కారణలపై అన్వేషిస్తున్న ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా జీఎస్టీ ఎగవేతదారులను గుర్తించడం, నకిలీ ఇన్ వాయిస్‌లను పెట్టి రీఫండ్లు తీసుకున్న వారిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అదేవిధంగా జీఎస్టీ చెల్లించకుండా జీరో వ్యాపారం చేస్తుండడం, మరోవైపు వార్షిక టర్నోవర్ రూ.5 కోట్లుగా ఉండే దాదాపు 15,000ల అసెస్‌మెంట్లను పునఃపరిశీలన చేయడం, మద్యం విక్రయాల్లో అనధికారిక మద్యం సరఫరా జరిగినట్లు వస్తున్న సమాచారంపై లోతైన అధ్యయనం చేయడం లాంటి చర్యలకు ప్రస్తుతం ఆ శాఖ శ్రీకారం చుట్టింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com