మద్యం మత్తులో సిగరెట్ అంటించుకుని నిద్రమత్తులోకి జారుకొని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అగ్నికి ఆహుతైన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం మంగళతండాలో చోటుచేసుకుంది. ధారావత్ బాలాజీ నడిగూడెం మండలం చెన్నకేశవపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యారు.
శ్రీరామనవమి కావడంతో బాలాజీ భార్య, తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని పుట్టింటికి ఇంటికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న ఆయన మద్యం తాగిన తర్వాత ఇంటి ఆవరణలో మంచంపై పడుకుని సిగరెట్ వెలిగించారు. తాగుతూ నిద్రలోకి జారుకున్నాడు. ప్రమాదవశాత్తు సిగరెట్ మంచం నవారుపై పడి మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి తప్పించుకునే స్థితిలో బాలాజీ లేకపోవడంతో శరీరానికి మంటలు అంటుకొని మృతి చెందారు. భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.