Sunday, September 29, 2024

మూసీ ఆక్రమణలపై ఏం చేద్దాం..?

  • నివాసితుల కోసం ఎలాంటి ప్రణాళికలు చేపడుతాం
  • 12 వేల ఆక్రమణల తొలగింపుపై వ్యతిరేకత రాకుండా
  • వారికి భరోసా కల్పించడం ఎలా..!
  • హైడ్రా, జీహెచ్‌ఎంసిల కమిషనర్‌లతో ఎంఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సమావేశం
  • పలు అంశాలపై చర్చ
  • మూసీపై ఉన్న 17 బ్రిడ్జిల పటిష్టతపై పరీక్షలు
  • రెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక

మూసీఒడ్డున అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే మూసీపై ఉన్న ఆక్రమణల తొలగింపు, మూసీ నివాసితుల కోసం చేపట్టాల్సిన ప్రణాళికలు తదితర అంశాలపై ఎంఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్‌ఎంసి కమిషనర్ అమ్రాపాలితో పాటు పలువురు అధికారులు మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఇప్పటికే మూసీపై 55 కిలోమీటర్ల పరిధిలో 12 వేలకు పైగా ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మూసీ నివాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగించే బాధ్యతను హైడ్రాకు ప్రభుత్వం అప్పగించింది. ఈ క్రమంలోనే కూల్చివేతల సందర్భంగా నివాసితులు నుంచి వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం ఈ ముందస్తు కార్యాచరణ చేపట్టింది. ప్రభుత్వం వారికి పూర్తిస్థాయి భరోసా కల్పించిన తర్వాత హైడ్రా బుల్డోజర్లతో రంగంలోకి దిగి వాటిని కూల్చివేయనుంది.

మూసీపై ఉన్న బ్రిడ్జిల పటిష్టతకు పరీక్షలు
ఇప్పటికే మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే మూసీ పరీవాహక ప్రాంతాలను సర్వే చేసిన అధికారులు తాజాగా మూసీపై నిజాం కాలంలో 58 కిలోమీటర్ల పొడవున నిర్మించిన17 బ్రిడ్జిల పటిష్టతపై పరీక్షలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దశాబ్ధాల కింద నిర్మించిన ఈ బ్రిడ్జిలు ప్రస్తుతం పటిష్టంగా ఉన్నాయా లేవా, ఇంకా ఎంత కాలం తట్టుకొని నిలబడగలవన్న అంశాలను పరిశీలించడానికి ప్రభుత్వం ఓ ఏజెన్సీని నియమించింది.

ప్రభుత్వం నియమించిన సదరు ఏజెన్సీ మూసీపై నిర్మించిన బ్రిడ్జిల్లో నయాపూల్ (పాతది, కొత్తది), పురానాపూల్ (పాతది, కొత్తది), నాగోల్ (ఓల్ అండ్ న్యూ), ఇమ్లిబన్ (ఇన్ అండ్ ఔట్), ముస్లింజంగ్ (ఓల్ అండ్ న్యూ), టిప్పుఖాన్(ఓల్ అండ్ న్యూ), బాపూఘాట్, సాలార్‌జంగ్, అత్తాపూర్, చాదర్‌ఘాట్, గోల్నాక బ్రిడ్జిలను పరిశీలించనుంది. ఈ బ్రిడ్జిలు నిజాం కాలంలో నిర్మించినవి కావడం, చారిత్రక నేపథ్యం ఉండడంతో లోపాలు ఉంటే కూల్చడం కంటే వారసత్వ కట్టడాలుగా భావించి మరమ్మతులు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. బ్రిడ్జిల పటిష్టత పరీక్షలు నిర్వహించేందుకు పలు కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించి ముంబైకి చెందిన స్ట్రక్ట్ వెల్ డిజైనర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. అందులో భాగంగా బ్రిడ్జిల పటిష్టతను పరిశీలించడానికి సదరు కంపెనీ రీబౌండ్ హ్యామర్ టెస్ట్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, డైనమిక్ లోడ్ టెస్టింగ్‌ను నిర్వహించనుంది. ఈ కంపెనీ రెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular