రాష్ట్రంలోని రహదారులను హైబ్రిడ్ అన్యూటీ మోడల్ (హెచ్‌ఏఎమ్) ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ మోడల్లో 40 శాతం ప్రభుత్వ నిధులతో, 60 శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో హైవేలపై ప్రయాణించేటప్పుడు వసూలు చేసే టోల్ ఛార్జీని.. ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వసూలు చేసే అవకాశం ఉంది. హైబ్రిడ్ అన్యూటీ మోడల్‌లో 2028 వరకు 17 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను సుమారు రూ. 28 వేల కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 769.35 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారుల నిర్మాణానికి రూ. 3,725.22 కోట్ల మేర పరిపాలనా అనుమతులు జారీ చేసింది. వీటిలో 55 కి.మీ. పొడవు కలిగిన రహదారులు, 9 వంతెనల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి వీలుగా, ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండేలా రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడైపోయిన రహదారుల మరమ్మతులు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.