- ఏపీ హైకోర్టు తీర్పు
- మెయిన్స్ జవాబు పత్రాల రెండుసార్లు మూల్యాంకనం ప్రభావం
- ఈ ప్రక్రియ చట్ట విరుద్ధమన్న న్యాయస్థానం
- హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్ధులు
- 2018లో గ్రూప్ 1 పరీక్ష పై తీర్పు
- ఇప్పటికే విధుల్లో ఉన్న అధికారులు
- ఈ తీర్పుతో తాజా పరీక్షపై ప్రభావం
ఏపీలో కీలకమైన ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో హైకోర్టు ప్రభుత్వం, అధికారపార్టీకి షాక్‌ని ఇచ్చింది. గ్రూప్–1ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. 2018 లో నిర్వహించి గ్రూప్–1 పరీక్షల ఎంపిక ప్రక్రియ ఇటీవలే తుది దశకు చేరింది. నియామకపత్రాలు అందుకుని విధుల్లో ఉన్న గ్రూప్–1 ఉద్యోగులకు తాజా పరిణామాలు షాక్ ఇచ్చాయి. అసలే ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులు.. ఈ పరిణామాలతో మరింత మండిపడుతున్నారు. నిరుద్యోగుల అసంతృప్తిని గుర్తించిన వైసీపీ ప్రభుత్వం.. గ్రూప్–1 ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అయితే, 2018లో భర్తీ చేసిన వాటితో పాటుగా.. తాజాగా కూడా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి, నిరుద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను కొంత మేరకైనా అనుకూలంగా మల్చుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను న్యాయస్థానం కొట్టిపారేసింది. దీంతో అటు నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తూ ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల ముందు ఇది అధికారపార్టీకి కోలుకోలేని దెబ్బగా మారింది. 2018 ఉద్యోగాలపై కోర్టు తీర్పు నేపథ్యంలో.. తాజాగా నిర్వహించే గ్రూప్–1 పరీక్ష ఉంటుందా.. లేదా అనే అంశం సందిగ్థంలో పడింది. ఇక, 2018 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కూడా అప్పీల్‌కి వెళతామని ప్రకటించింది.
రద్దు
ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షల్లో రెండుసార్లు వ్యాల్యూయేషన్ నిర్వహణను సవాల్ చేస్తూ అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆరు వారాల్లో మరోసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలని తీర్పు చెప్పింది. దీంతో ఆ పరీక్ష రాసిన అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లో 167 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి 2018 మే 26న ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80,250 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో పేపర్-1 (జనరల్ స్టడీస్) పరీక్షకు 59,697 మంది అభ్యర్థులు.. పేపర్-2 పరీక్షకు 59,200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో మొత్తం 8,351 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. డిసెంబర్ 12 నుంచి 23 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. అనంతరం ఫైనల్ రిజల్ట్స్ వెల్లడించి.. ఇంటర్వూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసింది. తాజాగా హైకోర్టు మెయిన్స్ పరీక్షను రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.
రాంగ్ వాల్యూయేషన్
ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టు తీసుకున్న నిర్ణయం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఈ పరీక్షల్లో రెండుసార్లు వ్యాల్యూయేషన్ నిర్వహణను సవాల్ చేస్తూ అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆరు వారాల్లో మరోసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలని తీర్పు చెప్పింది. గ్రూప్-–1 మెయిన్స్ జవాబు పత్రాలను మాన్యువల్ గా (చేతితో దిద్దడం) రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మొదటిసారి జరిగిన మూల్యాంకనాన్ని తొక్కిపెట్టి, రెండోసారి తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకోడానికే ఇలా దిద్దించారని వారు పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెల్లడించింది. 2018 నోటిఫికేషన్ కి సంబంధించి గ్రూప్-1 మెయిన్స్ ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
తాజా పరిస్థితి ఏమిటి..?
2018లో నిర్వహించిన గ్రూప్ –1 పరీక్షను రద్దు చేయగా.. ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఏపీపీఎస్‌సీ గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 17న జరిగే ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఇప్పటికే విడుదల అయ్యాయి. ఈ నెల 17 ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పేపర్1, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పేపర్2 పరీక్ష జరగనుంది. మొత్తం 81 పోస్టులకు 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పాత పరీక్ష రద్దుకావడంతో.. ఇప్పుడు నిర్వహించే కొత్త పరీక్షలపైనా ప్రభావం చూపనున్నది.
అప్పీల్‌కు వెళ్తాం
హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం స్పందించింది. 2018 గ్రూప్ -1పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆందోళన చెందవద్దని ప్రభుత్వం సూచించింది. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్నవారి ప్రయోజనాలను కాపాడుతామని పేర్కొంది. వారి తరఫున న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రకటించింది. ఎవరికీ ఆందోళన అవసరం లేదని, వారి ప్రయోజనాలను పరిరక్షిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.