Sunday, October 6, 2024

Group1 Prelims Results: గ్రూప్​ –1 ప్రిలిమ్స్​ ఫలితాలు విడుదల

  • మెయిన్స్​కు 31,382 మంది ఎంపిక
  • 1:50 ప్రకారమే నిర్ణయం

గ్రూప్ –1 ప్రిలిమ్స్ తుది కీతో పాటు ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం ప్రకటించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత కమిషన్ తుది కీ విడుదల చేసింది. అనంతరం ఫలితాలు వెల్లడించింది. ఫలితాలు టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో చెక్ చేసుకోవచ్చని కమిషన్ అధికారులు తెలిపారు. గ్రూప్​-1 మెయిన్స్​కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు వెల్లడించారు. జూన్​13న ప్రిలిమినరీ కీతో పాటు ప్రధాన ప్రశ్న పత్రాన్ని అభ్యర్థుల లాగిన్​లో అందుబాటులో ఉంచింది. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించిన తరవాత నిపుణుల అభిప్రాయాలు తీసుకుని ఆదివారం తుది కీతో పాటు ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్​సైట్​లో చూసుకోవచ్చని తెలిపింది. అక్టోబర్​ 21 నుంచి 27 వరకు గ్రూప్​ 1 మెయిన్స్​ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షకు వారం రోజుల ముందు నుంచే అభ్యర్థులు హాల్​ టికెట్​లు డౌన్​లోడ్​ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

కాగా, గ్రూప్ –1 మెయిన్స్​కు ఎంపిక విధానంలో నిష్పత్తిని తగ్గించాలని నిరసనలు ఎదురైనప్పటికీ.. టీజీపీఎస్సీ మాత్రం పాత విధానాన్ని కొనసాగించింది. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్​-1 పరీక్ష మెయిన్స్​కు అభ్యర్థుల ఎంపిక 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో చేయాలని రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు, కొందరు అభ్యర్థులు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే టీజీపీఎస్సీ మాత్రం గ్రూప్​–-1 మెయిన్స్​కు 1:50 నిష్పత్తిలోనే ఎంపిక ఉంటుందని స్పష్టం చేసింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జోవో 29,55 నిబంధనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ప్రకటన కూడా చేసింది.

టీజీపీఎస్సీ ప్రకటనపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 1:100 నిష్పత్తిలోని ఎంపిక చేసి ప్రతిభ గల అభ్యర్థులకు న్యాయం చేయాలని పిటిషన్​ వేశారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం ఈ సమస్యను చట్టానికి లోబడి త్వరితగతిన కమిషన్​ చర్యలు తీసుకోవాలని సూచించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను పరిశీలించిన టీజీపీఎస్సీ 1:100 పద్ధతి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఏ విధానం 1:50 ఉందో దాన్నే కొనసాగిస్తున్నామని చెప్పి ఆదివారం ప్రధాన కీతో పాటు ప్రిలిమినరీ పూర్తి ఫలితాలను విడుదల చేసింది.

సీఎం, కేంద్రమంత్రి అభినందనలు
గ్రూప్ – 1 మెయిన్స్​కు అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 21 – 27 మధ్య జరిగే మెయిన్స్ పరీక్షల్లో కూడా వారు విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రాథమిక పరీక్షలో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడవద్దని సూచించారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్ధేశించుకోవడం దాని కోసం ప్రయత్నించడం.. విజయం సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకపోవడం ఒక వ్యాపకంగా పెట్టుకున్న వారు ఎప్పటికైనా విజయతీరాలను చేరుతారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపిక కాని అభ్యర్థులు సైతం నిరాశ పడవద్దని సూచించారు.

వెనక్కి తగ్గలేదు
కాగా గ్రూప్‌–-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి ప్రకారంగా అభ్యర్ధులను ఎంపికచేయాలని నిరుద్యోగులు గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తగ్గలేదు. జులై 5న నిరుద్యోగులు టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించినా.. పట్టించుకోని టీజీపీఎస్సీ 1:50 నిష్పత్తి ప్రాతిపదికనే అభ్యర్థులను ఎంపికచేస్తామని ప్రకటించింది. ఆ ప్రకారంగానే ఫలితాలను వెల్లడించింది. 1:100 నిష్పత్తి అమలు చేస్తే, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని ఇప్పటికే రేవంత్ సర్కార్‌ స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1:50 నిష్పతి అమలు కోసం తీసుకొచ్చిన జీవో 29ని సవరించాలని గ్రూప్‌ 1 అభ్యర్థులు ఎంతగా డిమాండ్‌ చేసినా ఫలితం లేకపోయింది.

ఈ జీవో వల్ల రిజర్వేషన్‌ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, ప్రతిభ ఆధారంగా జీవో (నం.55, 29)లలోని నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు మెయిన్స్‌కు అభ్యర్థుల్ని జీవోలు, ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్నట్లుగా 1:50 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామని తెలిపింది. 1:100 నిష్పత్తిలో ఎంపిక సాధ్యం కాదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

విజ్ఞప్తులను ఎందుకు తిరస్కరించారంటే..!
2024 ఫిబ్రవరి 19వ తేదీన టీజీపీఎస్సీ గ్రూప్‌–-1 ఉద్యోగానికి ప్రకటన విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష జూన్‌ 9న ఉదయం నిర్వహించింది. ప్రధాన పరీక్షకు మల్టీజోన్‌ 1, 2 వారీగా 1: 50 నిష్పత్తిగా గా కాకుండా 1:100 అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరుతూ కొందరు కోర్టును ఆశ్రయించారు. సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన జీవో నెంబర్.55 (తేదీ 25/04/2022), దీన్ని సవరణ చేస్తూ జారీ చేసిన జీవో నం.29కి లోబడి గ్రూప్‌-1 ప్రధాన పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొంటూ ఉద్యోగ ప్రకటన జారీ అయింది.

1:50 నిష్పత్తిలో ఎంపిక విషయమై జీవోలోని పేరా నెంబర్.5లో స్పష్టంగా ఉంది. ప్రతి మల్టీజోన్‌లో ఉద్యోగాల సంఖ్య ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేస్తారని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్‌ సర్వీసు నిబంధనలు -1996 లోని 22, 22 ఏ ప్రకారం సంబంధిత రిజర్వుడ్‌ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే, అందుకు అనుగుణంగా ఆ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని జీవోలో స్పష్టం చేసింది.

మెయిన్స్​కు అభ్యర్థుల ఎంపికపై ఉద్యోగ ప్రకటనలో నెంబర్. 02/2024లోని పేజి నెంబర్.16లోని పేరా 12 లోని పేరా ‘బీ’ లోనూ 1 నిష్పత్తి 50గా ఎంపికపై స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలకు లోబడి కమిషన్‌ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనల్ని వెలువరించి భర్తీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన తరువాత వాటిని తిరస్కరిస్తున్నట్లు టీజీపీఎస్సీ తాజాగా ప్రకటించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular