ముఖ్యమంత్రి కేసిఆర్ ఇండ్లులేని నిరుపేదల కోసం.. ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే.. లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందక్కర్లేదని దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కి దరఖాస్తులు పంపించవచ్చని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని.. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3 వేల ఇండ్లు పూర్తయ్యాక.. రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందక్కర్లేదని దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తామన్నారు. ప్రతి పక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మవద్దని సూచించారు.