- డిప్యూటీ కమిషనర్ నుంచి కిందిస్థాయి వరకు పంపకాలు
- మరికొంత మంది అధికారులను విచారించనున్న పోలీసులు
జీఎస్టీ రీఫండ్ కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ ఇచ్చిన ఫిర్యాదుపై ఆ శాఖకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు రూ. 40 కోట్ల రూపాయల రీఫండ్‌లకు చెందిన అరెస్టులు జరిగినప్పటికీ మరికొన్ని రీఫండ్లపై శాఖాపరంగా, పోలీసులతో పాటు వాణిజ్యపన్నుల శాఖ అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ కుంభకోణంలో డిప్యూటీ కమిషనర్ నుంచి కిందిస్థాయి వరకు పంపకాలు జరిగినట్లుగా తెలిసింది.గత ప్రభుత్వ హయాంలో ఎలక్ట్రికల్ వాహనాల విక్రయాల నిమిత్తం పలు షోరూంల నిర్వహణ కోసం వాణిజ్య పన్నులశాఖ డీలర్లకు జీఎస్టీ లైసెన్స్‌లు ఇచ్చింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు చేయకుండానే చేసినట్లు బోగస్ ఇన్‌వాయిస్‌లను సృష్టించి జీఎస్టీ వెబ్‌పోర్టల్లో అధికారులు వాటిని అప్‌లోడ్ చేశారు. తద్వారా రీఫండ్ తీసుకొని ప్రభుత్వ సొమ్మును అధికారులతో కుమ్మక్కై కొందరు అక్రమార్కులు నొక్కేశారు. 2022 జూలై నుంచి 2023 నవంబర్ వరకు జరిగిన ఈ రీఫండ్‌ల కుంభకోణాన్ని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి వెలుగులోకి తీసుకొచ్చింది.
నలుగురు అధికారుల సహకారంతోనే ఈ వ్యాపారం…
జీఎస్టీ చట్టంలోని వెసులుబాటును ఆసరా చేసుకుని అంతర్రాష్ట్ర ట్యాక్స్ కన్సల్టెంట్‌ల సహకారంతో ఈ అక్రమార్కులు ఈ అవినీతికి బీజం వేశారు. దీంతో అక్రమార్కుల నుంచి అందినకాడికి కమీషన్లు దండుకొని డిప్యూటీ కమిషనర్ నుంచి కిందస్థాయి డిసిటిఓ వరకు పంపకాలు జరిగినట్లుగా ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం గుర్తించారు. ప్రాథమిక అంచనా మేరకు నలుగురు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల సహకారంతో వ్యాపారం చేయకుండానే చేసినట్లు చూపెట్టినట్టు ఆ శాఖ ఉన్నతాధికారుల విచారణతో తేలింది. ప్రస్తుతం మరిన్ని విషయాలు కూడా అధికారుల విచారణలో వెలుగుచూస్తున్నట్టుగా సమాచారం.
ఎలక్ట్రిక్ వాహనాలకు 5 శాతం జీఎస్టీ…
కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున విక్రయించేందుకు రాయితీలను కల్పించింది.
ఎలక్ట్రిక్ వాహనాల విలువపై కేవలం 5 శాతం మాత్రమే జీఎస్టీ వేస్తుంది. కానీ, ద్విచక్రవాహనాల విడిభాగాల కొనుగోలుపై 18శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. దీంతో ఎలక్ట్రిక్ బైకుల విక్రయాలపై వచ్చిన 5శాతం జీఎస్టీని మినహాయించి మరో 13శాతం జీఎస్టీ రీఫండ్ ఇవ్వాల్సి ఉంది. కానీ, చాలా మంది అధికారులు రీఫండ్ దరఖాస్తులను పరిశీలన చేయకుండానే ఇచ్చారని ప్రస్తుతం ఆ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. మరికొందరు అధికారులు బోగస్ ఇన్‌వాయిస్‌లని తెలిసినా రీఫండ్‌లు ఇచ్చినట్లుగా అధికారుల విచారణలో తేలింది.
మరికొంతమంది అధికారులను విచారణ చేయాలని….
ఇప్పటి వరకు రూ.40 కోట్ల రూపాయలు రీఫండ్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. బోగస్ సంస్థలకు రిజిస్ట్రేషన్ ఇచ్చిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని పోలీసు శాఖ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొంటున్న అధికారులు కాకుండా మరికొందరు కూడా ఈ రీఫండ్‌లు ఇచ్చిన అధికారులు ఉండడంతో వారిని కూడా విచారణ చేయాలని సిసిఎస్ అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.