తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఓ పదో తరగతి బాలిక గుండె పోటుతో మరణించింది. గురువారం ఉదయం స్కూల్‌కి నడుచుకుని వెళ్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే స్కూల్ యాజమాన్యం సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యంలోనే ఆ యువతి మృతి చెందింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లిలో పదవ తరగతి చదువుతున్న శ్రీనిధి(14) కామారెడ్డిలోని కల్కినగర్‌లో పెద్దనాన్న ఇంట్లో ఉంటోంది. అక్కడే ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉంటూ చదువుతోంది. అయితే గురువారం స్కూల్‌కి బయలు దేరే సమయంలో ఉదయం ఇంటి దగ్గర తినకుండా బయలు దేరింది. స్కూల్‌లో తింటానని టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్లింది. నడుస్తూ స్కూల్‌కి వెళ్తున్న ఆ విద్యార్థిని పాఠశాల దగ్గరలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే సీపీఆర్ చేసి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోయిసరికి వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్తుండగానే మార్గమధ్యంలో ఆ విద్యార్థిని మృతి చెందింది. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణలో ఓ న్యాయవాది గుండె పోటుతో కోర్టులోనే మృతి చెందారు. తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ వేణుగోపాల్ అనే ఓ న్యాయవాది గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే సికింద్రాబాద్ కోర్టులో మరో న్యాయవాది కూడా కన్నుమూశారు. వెంకటరమణ అనే న్యాయవాదికి గుండె పోటు రావడంతో కోర్టు ఆవరణలోనే కన్నుమూశారు. వెంటనే గమనించి తోటి న్యాయవాదులు ఆసుపత్రికి తరలించే లోపే వెంకటరమణ మృతి చెందారు.