పెద్దాపూర్ గురుకుల స్కూల్‌లో మరో విద్యార్థిని కరిచిన పాము
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. గురువారం ఉదయం ఎనిమిదో తరగతి చదువుతున్న యశ్వంత్ అనే విద్యార్థిని పాము కాటేసింది. దీంతో స్కూల్ ప్రిన్సిపల్ అతడిని కోరుట్ల దవాఖానకు తరలించారు. బుధవారం ఇదే స్కూల్‌లో ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని పాము కరిచిన విషయం తెలిసిందే. యశ్వంత్ ఉదయం నిద్రలేచేసరికి కాలుకు గాయమై ఉంది. దురదలు రావడంతో విషయాన్ని ప్రిన్సిపల్‌కు చెప్పాడు. దీంతో యశ్వంత్‌ను కోరుట్ల పట్టణంలోని దవాఖానకు తరలించారు. అక్కడ టెస్టులు చేయగా పాము కాటేసినట్లు తేలింది. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈ గురుకుల పాఠశాలలో పాములు ఆరుగురిని కాటేశాయి. వారిలో ఇద్దరు మృతి చెందారు. వరుస పాము కాటు ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.