గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పట్ల మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వ తీరు మారడం లేదని.. గురుకుల విద్యార్థుల కష్టాలు తీరడం లేదని అన్నారు. ఇప్పటికీ అదే నిర్లక్ష్యం, అదే అలసత్వం కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల మంచిర్యాల గిరిజన గురుకులంలో 12 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలైన ఘటన గడిచి 24 గంటలు కూడా కాకముందే, మరోసారి వాంతులు, కడుపునొప్పితో విద్యార్థులు ఆసుపత్రికి చేరుకున్న పరిస్థితి నెలకొందని హరీశ్‌రావు అన్నారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు సరైన వైద్యం అందించలేని దుర్మార్గ దుస్థితికి ఈ ప్రభుత్వం చేరుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గాడి తప్పిన పాలనకు వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. నిర్మల్, వాంకిడి, మంచిర్యాల గురుకులాల్లో ఇప్పటి వరకు మొత్తం 94 మంది ఆసుపత్రుల పాలవ్వగా, ఇంద్రవెల్లి, నిర్మల్ గురుకులాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు జ్వరంతో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాంకిడి గురుకులానికి చెందిన ముగ్గురు విద్యార్థుల పరిస్థితి ఇంకా అలాగే ఉందని.. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. మొద్దు నిద్ర వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పోను బిడ్డో సర్కారు దవాఖానకు అనేది ఏండ్ల నుంచి వస్తున్న కాంగ్రెస్ పాలన మార్క్ అయితే, ఇప్పుడు నేను పోను బిడ్డో గురుకుల పాఠశాలకు అనేది కాంగ్రెస్ సర్కారు నయా మార్క్ గా మారిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, పతనమవుతున్న గురుకులాలపై సమీక్ష నిర్వహించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.