- అయితే షుగర్ వచ్చే ఛాన్స్
- వెల్లడించిన కేంబ్రిడ్జ్ రీసెర్చ్
మీరు నాన్‌వెజ్ ప్రియులా? అందులో మటన్ కాస్త ఎక్కువగానే లాగిస్తుంటారా? అయితే మీకో అలర్ట్. ఇటీవల జరిగిన ఓ పరిశోధనలో మటన్ ఎక్కువగా తినే వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది! ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చాలా మంది ఇళ్లలో వీకెండ్ వచ్చిందంటే నాన్‌వెజ్ ఉండాల్సిందే. అలాగే.. ఇంట్లో ఏదైనా ఫంక్షన్, పార్టీ జరిగినా ఎక్కువ మంది మాంసాహారానికి ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అందులో ముఖ్యంగా మెజార్టీ పీపుల్ మటన్ ఇష్టపడతారు. ఆ జాబితాలో మీరూ ఉన్నారా? అయితే.. అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇటీవల జరిగిన ఓ పరిశోధనలో మటన్ ఎక్కువగా తినే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయని కనుగొన్నారు.
నిజానికి మటన్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లతోపాటు ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఫలితంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ.. మటన్ పలు అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందని మీకు తెలుసా? అందులో ముఖ్యంగా తరచూ మటన్ తినేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఓ పరిశోధనలో ఈ విషయం వెలుగు చూసింది.
ఈ పరిశోధనలో భాగంగా.. మటన్ తినే అలవాటున్న వారిని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పది సంవత్సరాల పాటు పరిశీలించారు. ఈ అధ్యయనం ద్వారా.. వారంలో రెండు మూడుసార్లు ఏదో ఒక రూపంలో(సూప్, వేపుడు, కూర) మటన్ తినేవారిలో టైప్-2 డయాబెటిస్ రావడానికి 15 శాతం ఎక్కువ అవకాశం ఉందని తేలిందట. (ఇందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ప్రధానంగా.. మటన్‌లోని హానికారక శాచురేటెడ్ కొవ్వులు సహజ ఇన్సులిన్ విడుదలను అడ్డుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారట.
అంతేకాదు, స్వయంగా ఇళ్లలో మటన్ వండుకునే వారితో పోలిస్తే.. వివిధ కంపెనీలు ప్రాసెస్ చేసి, నిల్వ ఉంచిన ప్యాకేజ్డ్ మటన్ తినేవారిలో డయాబెటిస్ ముప్పు మరీ ఎక్కువగా ఉంటుందని తేల్చారు. మటన్‌కు బదులుగా.. మంచి కొవ్వులూ, ప్రొటీన్ కోసం చేపలు తినడం మేలని సూచిస్తున్నారు. తరచూ మటన్ తినేవారు జాగ్రత్తగా ఉండడం మంచిదని ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రముఖ న్యూట్రిషనిస్ట్ “డాక్టర్ నీతా సూచిస్తున్నారు. శరీరపుష్టికి మాంసాహారం అవసరమే కానీ.. పరిమితికి మించి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు.