ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సమయం మొదలైంది. వరుసగా ఫిర్యాదులు రావడమే కాదు.. ఆధారాలు కూడా చేతికందుతున్నాయి. ఇప్పటిదాకా అధికారుల చుట్టూ తిరిగిన ఈ వ్యవహారంలో ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతల వంతు మొదలైంది. అటు బాధితులు కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి హరీష్‌రావు మీద పంజాగుట్టు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని బాచుపల్లికి చెందిన చక్రదర్‌గౌడ్ పంజాగుట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం వేధింపులు మాత్రమే కాకుండా తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫిర్యాదులో ప్రస్తావించాడు. దీంతో హరీశ్‌రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ముందు నుంచీ భయమే
ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ బీఆర్ఎస్ నేతల బాగోతాలు బయటపడుతున్నాయి. ఇదే కేసులో పలువురు అధికారులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు హరీష్‌రావుపై కేసు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంకా చక్రధర్ గౌడ్ లాంటి బాధితులు ఎంత మంది ఉన్నారనేది తెలియాల్సివుంది. ముందు నుంచీ ఫోన్ ట్యాపింగ్ కేసు.. బీఆర్‌ఎస్‌ను భయపెడుతున్నది. అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 13వేలకుపైగా ఫోన్లను ట్యాప్ చేయించారని ప్రాథమిక విచారణలో తేలింది. భుజంగరావు, రాధాకిషన్ రావును విచారణ చేసిన పోలీసులకు.. మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావించినట్లు ప్రచారం జరిగింది. అటు మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ట్యాపింగ్ జరిగిందని కూడా సూత్రప్రాయంగా వెల్లడించారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశం నేరుగా హరీష్‌రావు మెడకు చుట్టుకుంటున్నది. గతంలో రాధాకిషన్‌రావు, హరీష్‌రావులపై చక్రధర్ అనేకసార్లు ఫిర్యాదు కూడా చేశారు. గతంలో రైతులకు సంబంధించిన విషయంలో తాను చెక్ లు ఇచ్చానని, ఆ సమయంలో తాను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడమేకాకుండా కేసులు పెట్టి జైలుకి పంపిన విషయాన్ని చక్రధర్ ఫిర్యాదులో గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలోనే తన ఫోన్ ట్యాపింగ్ చేసి కదలికలను ఎప్పటికప్పుడు రాధాకిషన్‌రావు గుర్తించి హరీష్‌రావుకు సమాచారం ఇచ్చేవారని అందులో పేర్కొన్నారు. హరీష్‌రావు వల్లే తాను సర్వం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణకు దిగిన పంజాగుట్ట పోలీసులు.. చక్రధర్ నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావు జైలులో ఉండగా, రేపో మాపో హరీష్‌రావు నోటీసులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.