Tuesday, February 4, 2025

హరి హర వీరమల్లు ఎపిక్‌ యాక్షన్‌ డ్రామగా విజయం అందుకుంటుంది : నిర్మాత ఎ.ఎం. రత్నం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తాను నిర్మిస్తున్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఘన విజయం సాధిస్తుందని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నమ్మకం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 4న తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటన విడుదల చేసిన ఎ.ఎం. రత్నం, ‘హరి హర వీరమల్లు’తో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయే చిత్రాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

భారత దేశం గర్వించదగ్గ నిర్మాతలలో ఒకరు ఎ.ఎం. రత్నం. కేవలం నిర్మాతగానే కాకుండా గీత రచయితగా, రచయితగా, దర్శకుడిగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో తనదైన ముద్ర వేశారు. ఎ.ఎం.రత్నం 1953 ఫిబ్రవరి 4వ తేదీన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో జన్మించారు. సినిమానే తన జీవితంగా భావించి, అసాధారణ కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ భారతీయ సినీ దిగ్గజాలతో ఒకరిగా నిలిచారు. కర్తవ్యం వంటి మహిళా సాధికారత సబ్జెక్ట్‌తో నిర్మాతగా ప్రయాణాన్ని ప్రారంభించిన ఎ.ఎం.రత్నం, తొలి చిత్రంతోనే చరిత్రలో నిలిచిపోయే అడుగు వేశారు. నిర్మాతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన సినీ ప్రయాణంలో ఆయన ఎల్లప్పుడూ నైతికత, సామాజిక బాధ్యతను కొనసాగించారు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపించే చిత్రాలను ఎ.ఎం.రత్నం ఎప్పుడూ నిర్మించలేదు.

కుటుంబ విలువలు, ఐక్యత గురించి చెప్పే పెద్దరికం, సంకల్పం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు ఎ.ఎం.రత్నం. నిర్మాతగా కూడా నైతికత, సామాజిక బాధ్యతతో ఇండియన్, నట్పుక్కాగ, కధలర్ దినం, ఖుషి, బాయ్స్, గిల్లి, 7/G రెయిన్‌బో కాలనీ వంటి చిత్రాలను నిర్మించారు. మెగా బడ్జెట్ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన ఈ దిగ్గజ నిర్మాత, ఎ.ఆర్. రెహమాన్, శంకర్ వంటి భారతీయ సినిమా దిగ్గజాలతో పలు సినిమాలకు చేతులు కలిపారు. అలాగే స్నేహం కోసం చిత్రానికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేశారు. ఎన్నో గొప్ప చిత్రాలను అందించిన ఎ.ఎం.రత్నం మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతో పాటు మరెన్నో ప్రశంసలను గెలుచుకున్నారు.

నిర్మాతగా, దర్శకుడిగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గాను వ్యవహరించి ఎన్నో గొప్ప చిత్రాలను ప్రేక్షకులకు చేరువ చేశారు. అలాగే రచయితగా, గీత రచయితగా తనదైన ముద్ర వేశారు. జీన్స్, బాయ్స్ చిత్రాల తెలుగు పాటలను ఎ.ఎం.రత్నం రచించారు. ఆ పాటలు ఎంతటి ఆదరణ పొందాయో తెలిసిందే. ఇప్పటికీ ఎందరికో అభిమాన గీతాలుగా ఉన్నాయి. అంతేకాదు, కొందరు స్వార్థ రాజకీయ నాయకుల వలన ప్రజలు ఎలా నష్టపోతారో తెలిపే కథగా రూపొందిన నాగ చిత్రానికి, ఎ.ఎం.రత్నం స్క్రీన్ ప్లే అందించడంతో పాటు, గీత రచయితగా వ్యవహరించారు.

ఎ.ఎం.రత్నం సమాజంలో సానుకూలతను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మన దేశం, సమాజం మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు. గొప్ప అయ్యప్ప భక్తుడైన ఎ.ఎం.రత్నం, 42 సంవత్సరాలుగా స్వామి మాలను ధరిస్తూ శబరిమల యాత్రను కొనసాగిస్తున్నారు. తన వినయం, దాతృత్వం, నిబద్ధత, అంకితభావానికి పేరుగాంచిన ఈ అగ్ర నిర్మాత, భారతీయ సినిమా యొక్క సాంకేతిక విలువలు, ప్రమాణాలను మెరుగుపరచాలని మరియు చిత్ర పరిశ్రమను మెరుగుపరచాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు. ఎ.ఎం.రత్నం ప్రస్తుతం జాతీయ సమగ్రత గురించి మాట్లాడే భారీ బడ్జెట్ పీరియడ్ డ్రామా, హరి హర వీర మల్లును నిర్మిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తో ఎ.ఎం.రత్నం కు ఎంతో అనుబంధం ఉంది. వీరి కలయికలో గతంలో ఖుషి, బంగారం సినిమాలు వచ్చాయి. ఖుషి సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ చిత్రాలలో ఒకటిగా నిలవగా, బంగారం సినిమా పవన్ కళ్యాణ్ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు వీరి కలయికలో ముచ్చటగా మూడో సినిమాగా హరి హర వీరమల్లు రూపొందుతోంది. పవన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఎ.ఎం.రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తోన్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా, పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయం సాధిస్తుందని ఎ.ఎం.రత్నం నమ్మకం వ్యక్తం చేశారు.

చివరగా 2023లో బ్రో సినిమాతో ప్రేక్షకులను పలకరించారు పవన్ కళ్యాణ్. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత హరి హర వీరమల్లుతో వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో పాటు, భారీ బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందే గొప్ప చిత్రంగా హరి హర వీరమల్లు నిలుస్తుందని నిర్మాత ఎ.ఎం.రత్నం తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com