ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేసి చూపించు
ఆగస్టు 15లోగా పూర్తి చేస్తే….నేను రాజీనామా చేస్తా
లేని పక్షంలో రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా?
మరోసారి సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీశ్ రావు
తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధమేనని, అయితే రెండులక్షల రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీ ల్లో పదమూడు హామీలు ఆగస్టు 15 నాటికల్ల అమలు చేసి చూపించాలని మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి సవాల్ విసిరారు. రాజీనామా చేయడం తనకు కొత్త కాదన్నారు. గతంలో అనేక సార్లు చేశానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది రేవంత్ రెడ్డి కాదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది ఆయన కాదా? అని నిలదీశారు. ప్రజల కోసం నిరంతరంగా పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డి అయితే.. అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర తనదన్నారు.పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర తమదన్నారు. తనకు పదవులు కొత్త కాదు.. రాజీనామాలు కొత్త కాదన్నారు.
ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు తన వల్ల మంచి జరుగుతుందంటే ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడనని స్పష్టం చేశారు. అందుకే మరోసారి మరోసారి చెబుతున్నా.. వచ్చే నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు.