రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పాలమాకుల బాలిక గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఏ సమస్య ఉన్న తనకు ఫోన్ చేయాలంటూ విద్యార్థులకు హరీష్ రావు తన నెంబర్ ఇచ్చారు. పాఠశాలలో ఉన్న సమస్యల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల పరిస్థితి చూస్తే బాధేస్తుందన్నారు. మీరు వెళ్లిపోయాక మమ్మల్ని మళ్ళీ కొడతారు సారూ అంటూ విద్యార్థులు భయపడుతున్నారని చెప్పారు.
అటు విద్య లేదు ఇటు సరైన భోజనం లేదు.. కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి విద్యార్థులు చెబుతున్నారని అన్నారు. విద్యార్థులకు ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారని.. రెండో జత ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపారు. వారంలో ఐదు రోజులు ఎగ్స్ ఇవ్వాలి, రెండుసార్లు మాత్రమే ఇస్తున్నారు, మటన్ రెండు సార్లు పెట్టాలి, అసలు ఒకసారి కూడా పెట్టట్లేదు. చికెన్ ఒకసారి పెడుతున్నారని విద్యార్థులు చెప్పినట్లుగా తెలిపారు. టీచర్లు.. ఎస్సీ, ఎస్టీ అంటూ కూలాల పేర్లతో తిడుతున్నారని.. తమను తక్కువ చేసి మాట్లాడతారని విద్యార్థినులు వాపోయారని హరీష్ రావు తెలిపారు.