Saturday, February 8, 2025

హస్తిన చక్రవర్తి ఎవరు..?

ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ క్రమంలో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రజాస్వామ్య పండుగలో భాగంగా రాష్ట్రపతి భవన్‌లోని పోలింగ్ బూత్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటు వేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఆప్ అభ్యర్థి, ఢిల్లీ సీఎం అతిషి తన నివాసం నుంచి బయలుదేరి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సెంట్రల్ ఢిల్లీలోని జంగ్‌పురా నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా తన భార్యతో కలిసి లేడీ ఇర్విన్ స్కూల్‌లో పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2015, 2020లో రెండుసార్లు ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న ఆప్‌ ఈసారి కూడా మళ్లీ గట్టిపోటీ ఇస్తుండగా.. ఇటు బీజేపీ సైతం అదేస్థాయిలో పోటీపడింది. ఇక, గతంలో ఖాతా తెరవని కాంగ్రెస్‌.. ఇప్పుడైనా కొన్ని స్థానాలను గెలుచుకోవాలని ప్రయత్నాలు చేసింది.

కేంద్ర మంత్రులు కూడా..
దీంతోపాటు కేంద్ర మంత్రి హర్దీప్ పూరి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలో ఈ ఎన్నికల్లో 1.5 కోట్లకు పైగా ఓటర్లు తమ తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఈరోజు ఓటు వేస్తున్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుసగా మూడోసారి పోటీ చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలు దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి రావాలని ఆశిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 13,766 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రారంభమై, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

భారీగా భద్రత
ఎన్నికల కమిషన్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యాప్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇది ఓటర్లు బూత్‌ల వద్ద రియల్ టైమ్ జనసమూహాన్ని తనిఖీ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రశాంతమైన ఓటింగ్‌ను నిర్ధారించడానికి దాదాపు 220 కంపెనీల పారామిలిటరీ దళాలు, 35,626 ఢిల్లీ పోలీసు సిబ్బంది, 19,000 మంది హోమ్ గార్డులను ఎన్నికల కమిషన్ నియమించింది. దాదాపు 3,000 పోలింగ్ బూత్‌లను సున్నితమైనవిగా గుర్తించారు. వీటిలో కొన్నింటిలో డ్రోన్ నిఘాతో సహా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతలను కాపాడటానికి క్విక్ రియాక్షన్ టీమ్‌లను కూడా మోహరించారు. సున్నితమైన బూత్‌ల కోసం అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఫిబ్రవరి 8న జరగనుంది.

ఎవరికి పట్టం..?
దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ సాగనుండగా.. కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాలపైనే అందరి దృష్టి కనిపిస్తోంది. మరోవైపు.. కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తు ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించడంతో ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఏ సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకూడదు. ఇక ఈనెల 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇక, ఇప్పటికే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని గద్దె దించి.. ఎలాగైనా ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా పావులు కదుపుతోంది. బీజేపీ ఎత్తులకు ఆప్ కూడా గట్టిగానే పై ఎత్తులు వేస్తోంది. గత 2 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటి పూర్వ వైభవం తీసుకురావాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.

సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌
బుధవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్‌ను ఎన్నికల సంఘం నిషేధించడంతో.. సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం పేర్కొన్న నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే ముందు 48 గంటల వ్యవధిలో ఎలాంటి ఒపీనియన్ పోల్ గానీ సర్వే ఫలితాలు గానీ విడుదల చేయడం నిషేధం. సాయంత్రం 6.30 గంటల నుంచి వివిధ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిది విజయం అని అంచనాలు చేయనున్నాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా, సీ ఓటర్, ఐపీఎస్ఓఎస్, జన్ కీ బాత్, టుడేస్ ఛాణక్య వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించనున్నాయి.

కీలకం ఇవే
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కీలక స్థానాలుగా అంచనా వేస్తున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ తరపున అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్నారు. ఇంకా ప్రతాప్‌గంజ్ నియోజకవర్గంలో ఆప్ – అవధ్ ఓజా, బీజేపీ – రవిందర్ సింగ్ నేగి, కాంగ్రెస్ – అనిల్ చౌదరీ బరిలో ఉన్నారు. రోహిణి నియోజకవర్గంలో ఆప్ నుంచి ప్రదీప్ మిట్టల్, బీజేపీ తరపున విజేందర్ గుప్తా, కల్కాజీ నియోజకవర్గంలో ఆప్ – అతిషీ, బీజేపీ – రమేష్ బిధూరీ, కాంగ్రెస్ – అల్కా లంబా పోటీ చేస్తున్నారు. ఇక, మరో కీలక సెగ్మెంట్‌ జంగ్‌పురా నియోజకవర్గంలో ఆప్ తరపున మనీష్ సిసోడియా, బీజేపీ నుంచి సర్దార్ తర్వీందర్ సింగ్ మార్వా, కాంగ్రెస్ నుంచి ఫర్హాద్ సురి బరిలోకి నిలిచారు.
కాగా, ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 1.55 కోట్లు కాగా.. ఇందులో 83.49 లక్షల మంది పురుషులు.. 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక 20 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న యువ ఓటర్ల సంఖ్య 25.89 లక్షలుగా ఉంది. ఇక 2.08 లక్షల మంది ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు. వికలాంగులు 79,430 మంది ఓటర్లు ఉండగా.. 100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 830.. 85 ఏళ్ల వయసు దాటిన ఓటర్ల సంఖ్య 1.09 లక్షలుగా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు.. ఢిల్లీలో ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 1261 ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలోని 70 సీట్లలో ఆప్‌ 67 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ కేవలం 3 సీట్లకు పరిమితమైంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ అసలు ఖాతానే తెరవలేదు. 2020లోనూ మరోసారి ఆప్‌ హవానే కొనసాగింది. ఆ ఎన్నికల్లో ఆప్ 62 సీట్లు గెలుచుకోగా.. మిగిలిన 8 స్థానాలు బీజేపీ దక్కించుకుంది. ఇప్పుడు కొంత బీజేపీ వేవ్‌ ఉందని సర్వేలు చెబుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com