దేశ రాజధాని ఢిల్లీ పాలనా పగ్గాలు రేఖా గుప్తా చేతికి ఇచ్చారు. హస్తిన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ రామ్ లీలా మైదానంలో రేఖా గుప్తాతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా పర్వేశ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయగా.. ఆయనతోపాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేలు ఆశిష్ సూద్, మంజిన్డెర్ సింగ్ సిర్సా, రవీంద్ర రాజ్, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు కేంద్రమంత్రులు, ఎన్డీయే కీలక నేతలు, 20 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. మరోవైపు సినీ, పారిశ్రామిక రంగాల పలువురు ప్రముఖులు సైతం విచ్చేశారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.