హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల వివాదం కొనసాగుతున్న క్రమంలో ఓ జింక మృతి చర్చనీయాంశమైంది. హెచ్ సీయూ పరిధిలోని కంచ గచ్చిబౌలి 400ఎకరాల్లో నివసిస్తున్న జింకలు ప్రభుత్వం తాజాగా చేపట్టిన చెట్ల తొలగింపుతో ఆవాసం కోల్పోయి యూనివర్సిటీ క్యాంపస్ వైపునకు వచ్చాయి. అక్కడున్న కుక్కలు జింకపై దాడి చేయడంతో అది మృత్యువాత పడింది. కుక్కల దాడిలో జింకకు గాయాలు కావడంతో యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది పశువుల ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆ జింక మృతి చెందింది. ఇప్పుడు ఇదే అంశంపై విద్యార్ధులు, వారి ఆందోళనకు మద్ధతునిచ్చిన వారు మరింత రచ్చ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హెచ్ సీయూ భూముల పరిధిలో ఎలాంటి అటవీ ప్రాంతం లేదని..జింకలు, వన్యప్రాణులు లేవని చెప్పిన మాటలను గుర్తు చేస్తూ జింక మరణాన్ని లేవనెత్తుతూ తమ గళాన్ని వినిపిస్తున్నారు. జింక మరణంపై రేవంత్ రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇదే ప్రశ్నలతో విద్యార్ధులు కంచ గచ్చిబౌలి భూముల పట్ల ప్రభుత్వ వైఖరిని ఏకిపారెస్తున్నారు.