Monday, July 1, 2024

కేసీఆర్ పిటిష‌న్‌పై తీర్పును రిజ‌ర్వ్ చేసిన హైకోర్టు

హైకోర్టులో కేసీఆర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై వాద‌న‌లు ముగిశాయి. విద్యుత్ క‌మిష‌న్ ఏర్పాటు జీవోను కొట్టివేయాల‌ని కేసీఆర్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌స్టిస్ ఎల్ న‌ర‌సింహారెడ్డి జారీ చేసిన నోటీసులు ర‌ద్దు చేయాల‌ని కేసీఆర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. కేసీఆర్ పిటిష‌న్‌కు విచార‌ణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాద‌న‌లు ముగిశాయి. అనంత‌రం కేసీఆర్ పిటిష‌న్‌పై తీర్పు రిజ‌ర్వ్ చేసిన‌ట్లు హైకోర్టు ప్రక‌టించింది. సోమ‌వారం తీర్పు వెల్లడించే అవ‌కాశం ఉంది.

అయితే కేసీఆర్ దాఖ‌లు చేసిన‌ పిటిష‌న్‌ను విచారణ స్వీకరించవద్దని అడ్వకేట్ జ‌న‌ర‌ల్ కోరారు. పిటిషన్‌ను విచారణకు అనుమతించడంపైనే వాదనలు వినిపించాలని… మెరిట్స్‌లోకి వెళ్లవద్దని ఏజీకి ధర్మాసనం సూచించింది. ఏజీ వాదనలపై కేసీఆర్‌ న్యాయవాది ఆదిత్యా సోంధీ అభ్యంతర వ్యక్తం చేశారు. జ్యుడిషియల్‌ విచారణగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దానిపై నివేదిక ఇవ్వాలే గానీ, మీడియాకు వివరాలు వెల్లడించకూడదు. విద్యుత్‌ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముందే చెప్పి కారకులెవరో తేల్చమన్నారు. ఇది సరికాదు అని ఆదిత్యా సోంధీ పేర్కొన్నారు.

విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్‌ చేస్తూ కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలని హైకోర్టు గురువారం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం హైకోర్టు రిజస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది. విద్యుత్తు వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 14న జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘాన్ని నియమించింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపించింది. కమిషన్‌ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విద్యుత్తుశాఖ ముఖ్య కార్యదర్శిని, జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి విచారణ సంఘాన్ని, వ్యక్తిగత హోదాలో జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డిని ఇందులో ప్రతివాదులుగా పేరొన్నారు.

అయితే, జస్టిస్‌ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. నంబర్‌ కేటాయించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పిటిషన్‌ గురువారం హైకోర్టు ధర్మాసనం ముందు కు వచ్చింది. దాదాపు 45 నిమిషాలపాటు వాదప్రతివాదనలు జరిగాయి. కేసీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అదిత్య సోంధి బలంగా వాదనలు వినిపించారు. ఆయనతో ఏకీభవించిన ధర్మాసనం.. హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. పిటిషన్‌కు నంబర్‌ను కేటాయించాలని ఆదేశించింది. జస్టిస్‌ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పిటిషనర్‌ అభియోగాలు మోపిన నేపథ్యంలో, పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని వెల్లడించింది. ఈ మేర‌కు శుక్రవారం విచార‌ణ జ‌రిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular