వడదెబ్బ మరణాలకు ఎక్స్ గ్రేషియో రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంపు
రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆమేరకు సంబంధిత శాఖలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది -2025లో ఎండలు, వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉందని, జూన్ వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ, ఇండియన్ మెట్రాలాజికల్ శాఖ కలిసి సమగ్ర తెలంగాణ స్టేట్ హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ (HAP)-2025 ను విడుదల చేశారు. ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించారని తెలిపారు. మొత్తం 588 మండలాలను వడగాలుల ప్రభావిత ప్రాంతాలుగా వర్గీకరించామని, గతనెల 15న హీట్‌వేవ్‌ను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్‌గా నోటిఫై చేశామని తెలిపారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియోను రూ. 50 వేల నుంచి నాలుగు లక్షలకు పెంచినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల దృష్ట్యా చలివేంద్రాలలో త్రాగునీరుతోపాటు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్ల సరఫరా చేయాలని, సిఎస్ ఆర్ కింద వివిధ కంపెనీలు వీటిని సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం,మహబూబ్‌నగర్, నిజామాబాద్, కొత్తగూడెం, మెదక్, కరీంనగర్ తదితర పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టిసారించాలని సూచించారు. వడగాలుల ప్రభావం సామాన్యప్రజలపై పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, అనుకోని పరిస్ధితులలో ఎవరైనా చనిపోతే మానవతా దృక్ఫధంతో వ్యవహరించి తక్షణం ఎక్స్ గ్రేషియో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎండలకు సంబంధించిన సమాచారం, అధిక ఉష్ణోగ్రతల వేళ ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు, కూల్ వార్డుల ఏర్పాటు, ఆసుపత్రులలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహణ వంటి అంశాలపై చర్యలు చేపట్టాలని, ప్రజా ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులలో ఓఆర్ఎస్ ప్యాకట్లను అందుబాటులో ఉంచాలని, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖను మంత్రి ఆదేశించారు.
బస్టాండ్లు, మార్కెట్లు, పర్యాటక కేంద్రాలు, ప్రార్ధనా స్ధలాల వంటి పబ్లిక్ ప్రాంతాలలో అవసరమైన షెల్టర్లు, త్రాగునీరు, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్ ఇ డి స్క్రీన్ల ద్వారా ప్రచారం కల్పించాలని స్ధానిక సంస్దలు, మున్సిపాల్టీలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పార్కుల వద్ద పక్షులు, వీధి జంతువుల కోసం నీటి సరఫరాను సమకూర్చాలని చెప్పారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ది. పంచాయితీరాజ్ శాఖల తరపున ప్రజలకు క్లోరినేట్ చేసిన త్రాగునీటిని సరఫరా చేయాలని, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. అదేవిధంగా సమాచార శాఖ, మత్య్స, పశుసంవర్దక శాఖ, రక్షిత మంచినీటి సరఫరా, అటవీ, విద్యుత్ శాఖల అధికారులకు మార్గదర్శనం చేశారు.