టీఎస్, న్యూస్ :తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం.. మండుతున్న ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
దీంతో, వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి హీట్ వేవ్స్ అలెర్ట్ ప్రకటించారు. ఎండ వేడిమితో పాటు వడగాలుల తీవ్రత పెరిగింది. 11 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ లో 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదవుతోంది. రోడ్ల పైకి రావాలంటే జనం జంకుతున్నారు.
రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.
గత పది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
ఉక్క పోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చిన్న పిల్లలు, వృద్దుల పరిస్థితి వర్ణనాతీతం. ఏప్రిల్ లోనే ఇలా ఉంటే.. ఇక మే నెలలో ఉష్ణోగ్రతలు ఎంత దారుణంగా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు.
మధ్యాహ్నం సమయంలో విపరీతమైన వడగాలులు వీస్తున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక ప్రజలు చల్లని పానీయాల వైపు పరుగులు తీస్తున్నారు..